గల్ప్ దేశాల సీక్రెట్ ఆపరేషన్.. ప్లాన్ బీ?
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. తాజాగా గల్ఫ్‌లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ మద్య రహస్య దాడుల అంశం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. కువైట్ దీవిని ఆక్రమించేందుకు ఇరాన్ యత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీక్రెట్ దాడులు, ప్రతిదాడుల కారణంగా ఆందోళన నెలకొంది. గల్ప్ దేశాలు ఇలా రహస్య దాడులు చేయడంతో ప్రపంచమే షాకైంది.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు సమయంలో ఇరాన్.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి భయంకర దాడులు చేసింది. దీంతో, గల్ప్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్‌పై గల్ప్ దేశాలు ప్రతి దాడులు చేశాయి. అయితే, ఇదంతా రహ్యసంగా జరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ దాడులకు సౌదీ అరేబియా కూడా ప్రతీకార దాడులు చేసినట్లు బయటకొచ్చింది. మార్చి నెలాఖరులో సౌదీ వైమానిక దళం ఈ రహస్య దాడులకు పాల్పడినట్లు తాజాగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే వేటిని లక్ష్యంగా ఈ దాడులు జరిగాయనే దానిపై స్పష్టత లేదు. దీనిపై సౌదీ గానీ.. ఇరాన్ గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. యూఏఈ కూడా ఇరాన్‌పై రహస్య దాడులకు పాల్పడినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఇదిలా ఉండగా.. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన ప్రకటన గల్ఫ్ దేశాల్లో ఆందోళనలను మరింత పెంచింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడి, బుబియాన్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించింది. కానీ, ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. కాగా, కువైట్‌లోని బుబియాన్ అతిపెద్ద ద్వీపం . ఇందులో ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, సబ్‌స్టేషన్లతో సహా ప్రధాన పౌర, సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో చేపల పడవల్లో సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి దీనిలోకి చొరబడేందుకు ఇరాన్‌లోని ఐఆర్జీసీ నేవీకి చెందిన ఆరుగురు సిబ్బంది ప్రయత్నించారని కువైట్ ప్రభుత్వం పేర్కొంది. వారు తమ భూభాగంలో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించారని ఆరోపించింది. అయితే ఈ చొరబాటును తమ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించింది.