Select Location
All Locations
State
Region
City / District
భారత్‌కు బిగ్‌ షాక్‌.. భయానక పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

భారత్‌కు బిగ్‌ షాక్‌.. భయానక పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

న్యూఢిల్లీ, మే 12 : ఎప్పుడూ ఎంతో ఆశాభావంతో కనిపించే ఉదయ్‌ కొటక్‌.. ఇప్పుడు ఒకింత ఆందోళనకర సంకేతాలిచ్చారు. మంగళవారం ఇక్కడ జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు-2026 సందర్భంగా ఈ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ గంభీర ప్రసంగం చేశారు మరి. ఈ క్రమంలోనే భారత్‌కు ‘బిగ్‌ షాక్‌’ తగులబోతున్నదని, భయానక పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశీయ పరిశ్రమ సిద్ధంగా ఉండాలని తీవ్రంగానే హెచ్చరించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోల దశలోకి వచ్చిందన్న ఆయన.. ఇండస్ట్రీ వర్గాలు, విధానకర్తలు ఆ ఒడిదుడుకులను అధిగమించేందుకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌గా మొదలైన యుద్ధం.. రోజురోజుకూ అమెరికా-ఇరాన్‌గా మారింది. కేవలం మిడిల్‌ ఈస్ట్‌ దేశాలనేగాక, యావత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఈ వార్‌ ఇప్పుడు ప్రభావితం చేస్తున్నదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. దాదాపు రెండున్నర నెలలుగా సాగుతున్న ఈ పోరు.. ఆ మధ్య తగ్గినట్టే తగ్గి మళ్లీ తీవ్రతరమవుతున్నదిప్పుడు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌ చేస్తున్న ప్రతిపాదనలకు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ససేమిరా అంటుండటంతో గల్ఫ్‌లో తిరిగి ఉద్రిక్తకర వాతావరణం అలుముకుంటున్నది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో మరోమారు ముడి చమురు ధరలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే గడిచిన 10 వారాలను గ్రేస్‌ పీరియడ్‌గా అభివర్ణించిన కొటక్‌.. యుద్ధ ప్రభావాన్ని అదిమి పట్టిన ఆ సమయం ఇక ముగిసిపోయిందని అన్నారు. ‘రెండు నెలలకుపైగా జరుగుతున్న యుద్ధం ప్రభావాన్ని మనం ఇప్పటిదాకా చూడలేదు. అయితే ఇకపై చూడబోతున్నాం. అమెరికా-ఇరాన్‌ మధ్య పోరు రేపు ఉదయంకల్లా ఆగకపోతే.. ఆ తర్వాత జరిగే విపత్కర పరిణామాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కనుక ఆ భయంతో వేచిచూడటం కంటే.. ఈ కష్ట సమయాలను దాటేందుకు ప్రయత్నించడమే మన ముందున్న ఉత్తమ మార్గం’ అని ఉదయ్‌ కొటక్‌ అన్నారు.

అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం.. గల్ఫ్‌ దేశాల్లో చమురు, సహజ వాయువు ఉత్పత్తికి, హొర్ముజ్‌ జలసంధిలో సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నది. అమెరికాకు అండగా ఉంటున్నాయని యూఏఈ, ఖతార్‌, కువైట్‌, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ తదితర దేశాలపై ఇరాన్‌ విరుచుకుపడుతున్నది. అక్కడి చమురు బావులు, గ్యాస్‌ ప్లాంట్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నది. అంతేగాక ఆయా దేశాలకు, భారత్‌ సహా ఇతర దేశాలకు మధ్య సముద్రం మీదుగా సాగే రవాణాకు వారధిగా ఉన్న హొర్ముజ్‌ జలసంధిని మూసేసింది. దీంతో భారత్‌కు పెద్ద దెబ్బే తగిలింది. దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో ఎక్కువగా గల్ఫ్‌ దేశాల నుంచే వస్తున్నాయి. యుద్ధం కారణంగా ఇప్పుడు బ్రేకులుపడ్డాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు, ప్రీమియం పెట్రోల్‌ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. త్వరలో వంటగ్యాస్‌, ఇతర పెట్రో ఉత్పత్తుల రేట్లూ పెరుగడం ఖాయమన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే సరుకు రవాణా భారమై ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. ఆయా ముడి చమురు ఆధారిత పరిశ్రమల నిర్వహణ సైతం భారంగా మారుతుంది. నిరుద్యోగం, వడ్డీరేట్లు ఎగసి రుణ లభ్యత కరువైపోవడం, ఉత్పాదక రంగం కుదేలవడం, చివరకు దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ఉందన్న భయాలు ప్రస్తుతం కొటక్‌ మాటల్లో ధ్వనిస్తుండటం గమనార్హం.

పశ్చిమాసియా సంక్షోభం.. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకు దారితీస్తున్నదని ఉదయ్‌ కొటక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే విదేశీ పెట్టుబడులపై ఆధారపడకుండా ఉండాలని, ఇందుకు దేశీయంగానే భారీగా మూలధన నిల్వల్ని పోగేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అప్పుడే భారత్‌.. స్వయం సమృద్ధి దేశంగా ఎదుగుతుందని, నిజమైన ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలూ నెరవేరుతాయన్నారు. ‘మరెవరి శక్తి మీదనో, సొమ్ము మీదనో ఆధారపడాల్సి వస్తే.. అది ఆత్మనిర్భరత కాదు’ అని కొటక్‌ వ్యాఖ్యానించారు. మొత్తానికి బ్యారెల్‌ ముడి చమురు ధర 60 డాలర్లుగా ఉంటే.. దేశంలో కరెంట్‌ ఖాతా లోటు -1 శాతంగా ఉండి తట్టుకోగలమని, అదే 100 డాలర్లకు పెరిగితే లోటు -2.5 శాతానికి చేరి భారంగా పరిణమిస్తుందని అన్నారు. క్రూడ్‌ పెరిగినకొద్దీ.. వాటి దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌ వంటి దేశాలకు కష్టాలు తప్పవని స్పష్టం చేశారు.


Smacy News 49 minutes ago
Home Flash News