Kerala CM | కేరళ కాంగ్రెస్‌లో ముసలం.. కేసీ వేణుగోపాల్‌కు సీఎం పదవి.. వ్యతిరేకిస్తున్న వీడీ సతీషన్..?
Kerala CM : ఇటీవల జరిగిన ఐదు అసెంబ్లీలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువుదీరాయి. నాలుగు రాష్ట్రాల్లో సీఎంలు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, కేరళలో మాత్రం ఇంకా సీఎం ఎంపిక పూర్తి కాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. దీనంతటికీ కారణం.. కేరళ కాంగ్రెస్ పార్టీలోని వర్గ విబేధాలే. సీఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చడం లేదు. సీఎం ఎంపిక విషయంలో కేరళ కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడినట్లు కనిపిస్తోంది.
కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమికి అధికారం దక్కింది. ఇంతకుముందు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమి ఓడిపోయింది. దీంతో యూడీఎఫ్ అధికారం చేపట్టాలి. ఈ కూటమిలో అత్యధిక సీట్లతో కాంగ్రెస్ పార్టీకి సీఎం పదవి దక్కాలి. కానీ, పార్టీ అగ్రనేతల మధ్య సీఎం సీటు విషయంలో బేధాభిప్రాయాలున్నాయి. సీఎం పదవి కోసం కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, వీడీ సతీషన్, రమేష్ చెన్నితల పోటీ పడుతున్నారు. వీరిలో కేసీ వేణుగోపాల్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతోపాటు, అధిష్టానం మద్దతు కూడా ఆయనకే ఉంది. అయితే, ఆయనను సీఎం చేయడాన్ని సతీష్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వేణుగోపాల్‌ను సీఎంగా ఎన్నుకుంటే ఆయన తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలి.
అలాగే, మరో చోట ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలి. అంటే, తను రాజీనామా చేసిన స్థానంతోపాటు కొత్తగా పదవి కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో రెండు చోట్ల ఎన్నిక జరగాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పార్టీకి అంత మంచిది కాదని సతీషన్ వర్గం అంటోంది. ఒకవేళ వేణుగోపాల్‌ను సీఎం చేస్తే.. తాను ఆ మంత్రివర్గంలో చేరబోనని కూడా సతీషన్ తెలిపారు. దీంతో ఈ ఇద్దరి వర్గాలు పార్టీలో విబేధాలు తీసుకొచ్చాయి. అలాగే, రమేష్ చెన్నితల వర్గం కూడా సీఎం పదవి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీంతో ఎవరికి పదవి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ సతమతమవుతోంది.