తిరోగమనంలో రాష్ట్ర రాబడి.. బడ్జెట్ లక్ష్యం కొండంత.. ఆదాయం గోరంత
తెలంగాణను ఆర్థికంగా అగ్రపథాన నిలుపుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రగల్భాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సొంత పన్ను రాబడుల్లోనూ రాష్ట్రం వెనుకబాటే 2022-23లో రెవెన్యూ ఆదాయం 82.55 శాతం 2025-26లో 79.14 శాతానికి తగ్గుదల స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా కుదేలు 2021-22లో 98.98 శాతం, 2024-25లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన రాబడి 46.48 శాతమే కాగ్ నివేదికతో బట్టబయలైన పాలనా వైఫల్యాలు
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణను ఆర్థికంగా అగ్రపథాన నిలుపుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రగల్భాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో దూసుకుపోయిన రెవెన్యూ రిసీట్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం.. ప్రస్తుత పాలనలో తిరోగమనంలో సాగుతున్నాయి. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడికి మధ్య అగాధం పెరుగుతుండటం రాష్ట్ర ఆర్థిక అస్థిరతకు సంకేతంగా నిలుస్తున్నది. రాష్ట్ర సొంత పన్ను రాబడులైన రెవెన్యూ ఆదాయం కూడా దారుణంగా పడిపోయింది.తెలంగాణ వార్తలు
కేసీఆర్ పాలనలో కరోనా వంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా ఆదాయం నిలకడగా ఉన్నది. కానీ, ప్రస్తుత సాధారణ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.16 కోట్లు బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకోగా, మార్చినాటికి రూ.1.69 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే ప్రతిపాదిత అంచనాలో 78.08 శాతమే సమకూరింది. 2025-26లో రూ.2.29 లక్షల కోట్ల లక్ష్యం పెట్టుకోగా, వచ్చింది రూ.1.81 లక్షల కోట్లు మాత్రమే (79.14%). గత మూడేండ్లలోనూ ఆదాయ శాతం 75 శాతం నుంచి 79 శాతం మధ్యనే ఊగిసలాడుతున్నది. బడ్జెట్ అంకెలను భారీగా చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టడమే తప్ప,.
క్షేత్రస్థాయిలో నిధుల సమీకరణలో రేవంత్‌రెడ్డి సర్కార్ చేతులెత్తేసినట్టు కాగ్ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండే స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగంలో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. రేవంత్‌రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ రంగానికి గ్రహణం పట్టింది. హైడ్రా వంటి అనాలోచిత చర్యలతో స్థిరాస్తి రంగం కుదేలైంది. కేసీఆర్ పాలనలో రిజిస్ట్రేషన్ల ఆదాయం లక్ష్యానికి అత్యంత సమీపంలో (98.98% వరకు) ఉండగా, నేడు అది దారుణంగా పడిపోయింది. 2024-25 సంవత్సరంలో రూ.18,228 కోట్ల లక్ష్యానికిగాను, వచ్చింది రూ.8,473 కోట్లు మాత్రమే. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలు, హైడ్రా భయాలు, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే రిజిస్ట్రేషన్లు మందగించి రాష్ట్ర ఖజానాకు గండి పడుతున్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
కేసీఆర్ హయాంలో 2021-22లో స్టాంపుల ద్వారా 98.98% ఆదాయం రాగా, నేడు అది 79% దగ్గరే ఆగిపోవడం రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యానికి నిదర్శనం. సంక్షేమ పథకాలకు నిధులు లేక, అభివృద్ధి పనులకు బడ్జెట్ కేటాయింపులు చేయలేక ప్రభుత్వం సతమతమవుతున్నది. కేవలం అప్పుల మీద ఆధారపడటమే తప్ప, సొంత రాబడిని పెంచుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కాగ్ గణాంకాలు వెకిరిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడి, ఆదాయ వనరులను పెంచే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తినే ప్రమాదం ఉన్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.