మాకు గెలిచే అర్హత లేదు.. తప్పంతా వాళ్లదే: శుబ్‌మన్ గిల్
ఐపీఎల్-2026 ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి.. గుజరాత్‌పై 29 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవం చేసుకుంది.
ఈ నేపథ్యంలో కోల్‌కతా చేతిలో ఓటమి అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తమ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌లో అదరగొట్టినా ఫీల్డింగ్‌లో తాము విఫలమయ్యామని.. క్యాచ్‌లు జారవిడిచి మ్యాచ్‌ను చేజార్చుకున్నామని పేర్కొన్నాడు. మాకు గెలిచే అర్హత లేదు ఈ మేరకు.. ‘‘ఈ వికెట్ బాగుంది. ఇక్కడ 200- 210 పరుగులు స్కోరు చేయవచ్చు. మేము ఇక్కడ బాగా బ్యాటింగ్ చేశాము. ఈ విషయంలో ఆందోళన లేదు. అయితే, మా ఫీల్డింగ్ చెత్తగా సాగింది. మూడు సులువైన క్యాచ్‌లు వదిలేశాం. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు మాకు అర్హత లేదనే చెప్తాను.
ఏదేమైనా క్వాలిఫయర్స్‌కు చేరువవుతున్న సమయంలో ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్ మాకు మంచి ప్రాక్టీస్‌ను ఇచ్చింది. కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత బలంగా తిరిగి వస్తాము. తదుపరి మ్యాచ్ మా సొంతమైదానంలో జరుగనుంది. అందుకోసం అహ్మదాబాద్ బయల్దేరుతాం. అక్కడి వికెట్‌కు అనుగుణంగా మా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము’’ అని గిల్ పేర్కొన్నాడు. ఓటమికి ప్రధాన కారణం అదే ఫీల్డింగ్ తప్పిదాలే తమ కొంపముంచాయని.. తమ ఓటమికి ప్రధాన కారణం అదేనని గిల్ తెలిపాడు. కాగా కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను గుజరాత్ వదిలేసింది.