మంత్రి టీజీ భరత్‌కు సిద్ధార్థరెడ్డి కౌంటర్
కర్నూలు: తాను ఎమ్మెల్యే కావాలనే కోరిక తనకంటే మంత్రి టీజీ భరత్‌కే ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోందని వైఎస్సార్‌సీపీ యువజన రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుల వేధింపుల బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ తాము ధర్నాలు చేస్తే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ టీజీ కుటుంబంపై మండిపడ్డారు. టీజీ వెంకటేశ్ అంటే గౌరవం ఉండేదని.. కానీ తనపై చేసిన వ్యాఖ్యలు చూశాక, ఆయనపై గౌరవం పోయిందన్నారు. తన తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని టీడీపీ నేతలు తిట్టినా స్పందించని ఎంపీ బైరెడ్డి శబరి.. మంత్రి భరత్ గురించి తాను మాట్లాడితే పరుగెత్తుకుంటూ వచ్చి ప్రెస్‌మీట్లు పెట్టడం విడ్డూరంగా ఉందని సిద్ధార్థరెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ తనపై మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారని, 43 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ చేశారని.. ఇప్పుడు ఆయన వయసు ఇప్పుడు 50 ఏళ్లు అని చెప్పారు. 'నీ వయసుకు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే అప్పుడు అడగండి' అంటూ భరత్‌కు కౌంటర్ ఇచ్చారు. ''కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు నిరసనగా, అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈనెల 14న మేము ధర్నా కార్యక్రమం నిర్వహించాం. టీడీపీ నాయకుల వేధింపుల కారణంగా కర్నూలు పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న సతీశ్ అనే కుర్రాడి కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ఆ రోజు ధర్నా చేశాం. బాలు మరో కుర్రాడిపై పోలీసులు వేధింపులు ఆగాలన్న ఉద్దేశంతోనూ ధర్నా చేపట్టాం. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాయలం దగ్గర ధర్నాకు దిగాం. ప్రభుత్వాన్ని, మంత్రి టీజీ భరత్‌కు ప్రశ్నించామని గడచిన 3 రోజులుగా టీడీపీ నేతల, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీజీ వెంకటేశ్ తదితరులు మా గురించి రకరకాలు మాట్లాడారు. వారి మాటలకు సమాధానం చెప్పాలనే మీడియా ముందుకు వచ్చాను.