డియర్ NTA..కనీసం క్షమాపణ చెప్పరా?..పేపర్ లీక్‌పై నీట్ అభ్యర్థి బహిరంగ లేఖ
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్ 2026’ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను తీవ్ర మానసిక క్షోభలోకి నెట్టింది. ఎన్నో కలలతో, రాత్రింబగళ్లు కష్టపడి చదివిన అభ్యర్థులు.. ఇప్పుడు వ్యవస్థ వైఫల్యం వల్ల తమ భవిష్యత్తు అంధకారంలో పడిందంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, ఒక 18 ఏళ్ల అభ్యర్థి జాతీయ పరీక్షల సంస్థ (NTA) తీరును ఎండగడుతూ, విద్యార్థుల పక్షాన రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.
తన లేఖలో ఆ విద్యార్థి డాక్టర్ కావాలనే ఒకే ఒక్క లక్ష్యంతో తాను చేసిన త్యాగాలను గుర్తుచేసుకున్నాడు. ఇంటర్ 12వ తరగతి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించి, సోషల్ మీడియాకు, స్నేహితులకు, పార్టీలకు పూర్తిగా దూరమయ్యానని తెలిపాడు. చివరికి ఒకే ఇంట్లో ఉండే తన తోబుట్టువులను కూడా సరిగ్గా కలవకుండా ఒక గదికే పరిమితమై చదువుకున్నానని, తన టీనేజ్ సంతోషాలన్నింటినీ త్యాగం చేసింది ఇందుకేనా అని ప్రశ్నించాడు. పరీక్షకు కొద్దిరోజుల ముందు "ఇది స్కూల్ ఎగ్జామ్ కాదు.. నేషనల్ లెవెల్ ఫిల్ట్రేషన్ ఎగ్జామ్, మేము మీకంటే పది అడుగులు ముందున్నాం" అంటూ ఎన్టీఏ జారీ చేసిన నోటీసు విద్యార్థులను మానసికంగా భయపెట్టేలా ఉందని విమర్శించాడు.
ఎన్నాళ్లకో మళ్లీ కుటుంబంతో సంతోషంగా గడుపుదాం అనుకునే లోపే, కేవలం రెండు రోజుల్లోనే పేపర్ లీక్ అయిందని, మళ్లీ పరీక్ష (Re-NEET) నిర్వహిస్తామని ప్రకటించడం విద్యార్థులపై పిడుగులా పడిందని లేఖలో పేర్కొన్నాడు. ఈ దారుణ పరిస్థితిని చూసి తన 11 ఏళ్ల చిన్న చెల్లెలు "అన్నా.. మన దేశంలో మన భవిష్యత్తును ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు, నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకు" అని అన్నప్పుడు, వ్యవస్థ మనకు తోడుగా ఉందనే మాటను తాను ధైర్యంగా చెప్పలేకపోయానని బాధపడ్డాడు. ఈ రోజు తన తోబుట్టువులు భారతదేశంలో చదవడానికి ఆసక్తి చూపడం లేదని, ‘మేము ఈ దేశంలో ఉన్నందుకు గర్వపడుతున్నాం’ అని తాను ఏ మొహం పెట్టుకుని చెప్పాలని ప్రశ్నించాడు. ఒకవేళ ఆంక్షలు లేకపోతే తాను కూడా ఈ దేశం విడిచి వెళ్లిపోవడానికే మొగ్గు చూపుతానని, ఎందుకంటే ఇక్కడ రూల్స్ అన్నీ కాగితాల పైనే ఉంటాయని, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రతిసారీ విద్యార్థుల నమ్మకం ముక్కలవుతూనే ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కష్టపడి చదివేవారి కంటే లీకైన పేపర్లను కొనుక్కునే వారికే ఇక్కడ విజయం దక్కుతోందని మండిపడ్డాడు.