Select Location
All Locations
State
Region
City / District
99 రోజుల యాక్షన్ ప్లాన్..తెలంగాణలో గ్రాండ్ క్రీడా డ్రైవ్ ప్రారంభం

99 రోజుల యాక్షన్ ప్లాన్..తెలంగాణలో గ్రాండ్ క్రీడా డ్రైవ్ ప్రారంభం

రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా సరికొత్త క్రీడా డ్రైవ్ ప్రారంభమైంది. ఒలింపిక్స్ వంటి గ్లోబల్ ఈవెంట్లలో రాష్ట్ర అథ్లెట్లు గోల్డ్ మెడల్స్ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. మార్చి 6న ప్రారంభమైన ఈ 99 రోజుల ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ముగిసిన ‘సీఎం కప్’ పోటీలకు అద్భుతమైన స్పందన వచ్చిందని, గ్రామీణ స్థాయి నుంచి సుమారు 3.5 లక్షల మంది పిల్లలు ఇందులో భాగస్వామ్యమయ్యారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ అథ్లెట్లను గుర్తించి, వారిని ఉన్నత స్థాయికి చేర్చడమే ఈ డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలు, అధునాతన వసతులను మెరుగుపరచడంతో పాటు కోచ్‌లకు తగిన ప్రోత్సాహం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ముఖ్యంగా యువత, పిల్లలు డ్రగ్స్ మరియు ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, క్రీడల్లో చురుగ్గా రాణించాలన్నదే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని స్పష్టం చేశారు. తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మెరిసేలా ప్రభుత్వం అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన 5 కిలోమీటర్ల వాకథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. మే 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ క్రీడా పోటీలు మరియు అవగాహన కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.


Smacy News 13 minutes ago
Home Flash News