Select Location
All Locations
State
Region
City / District
కనీసం ‘సారీ’ కూడా చెప్పాలనిపించట్లేదా?!

కనీసం ‘సారీ’ కూడా చెప్పాలనిపించట్లేదా?!

డియర్‌ ఎన్‌టీఏ నాకు పద్దెనిమిదేండ్లు. ఈ ఏడాది నీట్‌ 2026 ఎగ్జామ్‌ రాశా. పన్నెండో తరగతి నుంచే ఈ పరీక్ష కోసం శ్రమిస్తున్నా. ఎగ్జామ్‌లో ఎలాగైనా ర్యాంక్‌ తెచ్చుకోవాలని ప్రిపరేషన్‌ టైమ్‌లో స్నేహితులతో కబుర్లు చెప్పడం మానేశా. సోషల్‌మీడియాను దూరంపెట్టా. పార్టీలకూ సెలవిచ్చా. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో నా తోబుట్టువులతో కూడా మాట్లాడలేదు. ఇవన్నీ నేను ఎందుకు చేశానో తెలుసా? డాక్టర్‌ను కావాలన్న ఒకే ఒక్క కోరిక.. నాతో ఇవన్నీ చేయించింది. ఎప్పుడైతే పరీక్షా తేదీ దగ్గరపడుతుందో నాలో ఆందోళన అంతకంతకూ పెరుగసాగింది. ఇదే సమయంలో ‘ఇది స్కూల్‌లో జరిగే పరీక్ష కాదు.. జాతీయస్థాయిలో జరిగే వడబోత పరీక్ష’ అంటూ ఎగ్జామ్‌కు 10-12 రోజుల ముందు ఎన్‌టీఏ విడుదల చేసిన నోటీసు నన్ను మరింత భయపెట్టింది. 

అవును. ఎన్‌టీఏ చెప్పినట్టు నీట్‌ పరీక్ష స్కూల్‌లో జరిగే ఎగ్జామ్‌ మాత్రం కానేకాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా? స్కూల్‌లో జరిగే పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడం అనేది ఉండదు. కానీ, నీట్‌ పరీక్షకు లీకుల మకిలి పట్టింది. అయినప్పటికీ, ‘మేము మిగతా పరీక్షా నిర్వహణలతో పోలిస్తే, పది అడుగులు ముందుంటాం’ అంటూ మీరు (ఎన్‌టీఏ) ప్రకటిస్తున్నారు చూడు.. అది సిగ్గుచేటు. ఇక్కడ ఒక్కమాట నిజం. మీరు నిజంగా పది అడుగుల ముందు ఉన్నారు. కానీ, ఏ విషయంలోనో తెలుసా? ఎగ్జామ్‌ సెంటర్‌ల ముందు మమ్మల్ని తనిఖీల పేరిట ఒకటికి రెండుసార్లు చెక్‌ చేస్తారు చూడు.. ఆ విషయంలో మీరు ముందున్నారు. అయితే, పరీక్షా కేంద్రాల దగ్గర పెట్టే అంచెలంచెల సెక్యూరిటీని.. ఎగ్జామ్‌ నిర్వహించే విషయంలో ఎందుకు పెట్టరు?? నీట్‌ పరీక్ష రోజు మేం ఎన్ని బాధలు పడ్డామో తెలుసా? ఎలాంటి లేబుల్స్‌ లేని పారదర్శక వాటర్‌ బాటిల్‌ను కూడా మేము లోపలికి తీసుకెళ్లలేమని పరీక్షా కేంద్రానికి చేరుకోగానే నాకు ఒక విషయం అర్థమయ్యింది. 

అసలే ఎండాకాలం. గొంతెండిపోయే పరిస్థితి.అయినప్పటికీ, మా కలలను సాకారం చేసుకోవడానికి అన్నింటినీ భరించాం. ఇక, చెకింగ్‌ పేరిట అక్కడ జరిగిన ప్రహసనం నా కండ్ల ముందు ఇప్పటికీ కదలాడుతున్నది. చీటింగ్‌ చేస్తామేమోనన్న అనుమానంతో మా ఆడపిల్లల జుత్తును విప్పమన్నారు. మహిళా టీచర్లు తమ చేతులతో జుత్తును వేళ్లు పెట్టి మరీ చెక్‌ చేశారు. జేబులు ఉన్నాయన్న కారణంతో టీ-షర్టులు, ప్యాంట్ల పాకెట్లను ఎడాపెడా కత్తిరించారు. ఇదంతా నా కండ్ల ముందే జరిగింది. ఇదంతా చూస్తే, స్టూడెంట్స్‌ అయిన మేమే పేపర్‌ను లీక్‌ చేస్తామేమోనని డౌట్‌ మీకు ఉన్నట్టుంది. అయినప్పటికీ, ఇదంతా భరించాం. ఈ తనిఖీలన్నింటినీ చూసి ఈ సారైనా పేపర్‌ లీక్‌ కాదేమో అన్న కొండంత ఆశతో నేను ఉన్నా. లీకేజీ ఉండదని, పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశామని పరీక్షకు ముందు అధికారులు గుప్పించిన హామీలను, వాగ్దానాలను నేను ఎంతో నమ్మాను. అయితే, వాస్తవంలో మాత్రం ఏం జరిగింది? మాకు చివరకు ఏం మిగిలింది? ఇప్పుడు నేను రాస్తున్న ఈ లేఖ.. కేవలం నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగానే కాదు మొత్తం ఈ వ్యవస్థ మీద నేను ఇప్పుడు చేస్తున్న పోరాటానికి ప్రతీక. 

అప్పుడైనా, నా యీ పోరాటంతో మాకు మల్లే ఇకపై భవిష్యత్తులో ఎవ్వరూ ఇలా నష్టపోరు కదా! ఈ సందర్భంగా ఎన్‌టీఏను ఒక్కటి అడగదలుచుకొన్నా. మీరన్నట్టు పదడుగులు ముందుండటం అంటే? ఏమిటీ?? ఈ పేపర్‌ లీకేజీయేనా?? అది. అయితే, సరే. మరేం పర్లేదు. పరీక్ష పత్రం లీకైంది కాబట్టి.. ఎగ్జామ్‌ కోసం మళ్లీ నేను చదువుతా. తనిఖీల పేరిట మీరు చేసే సెర్చింగ్‌ను నేను మరోసారి భరిస్తా. అయితే, మీకు (ఎన్‌టీఏ) ఒక్క ఆలోచన కూడా రావట్లేదా? ఇంతపెద్దయెత్తున పరీక్ష పేపర్‌ లీకైంది. ఇంతమంది విద్యార్థులకు ఇబ్బంది కలుగుతున్నది. మరి, వాళ్లకు క్షమాపణలు చెప్పాలన్న చిన్న ఆలోచన కూడా మీకు ఎందుకు రావట్లేదు?? సారీ పదానికి కూడా మేం అర్హులం కాదా? మీకు ఓ విషయం అస్సలు అర్ధంకావట్లేదు. నీట్‌ పరీక్ష కోసం నేను, నాతోపాటు లక్షలాది మంది విద్యార్థులు ఎన్ని కలలు కన్నామో తెలుసా? ఎగ్జామ్‌ రాసి బయటకు రాగానే.. ‘హమ్మయ్య.. ఇక మా ఫ్యామిలీ, తోబుట్టువులు, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఎంజాయ్‌ చేయొచ్చు’ అని మేము ఎంత ఆశపడ్డామో మీకు తెలుసా? అయితే, రెండు రోజు లు గడిచాయో లేదో.. పేపర్‌ లీకైందని, ఎగ్జామ్‌ను మళ్లీ పెడుతారన్న వార్తలు మమ్మల్ని షాక్‌కు గురి చేశాయి. ఈ ఒక్క ప్రకటనతో వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు మాదిరిగా మా ఆనందమంతా ఆవిరైపోయింది. 

ఇక్కడ నేను మరో విషయం గుర్తు చేయదలుచుకొన్నా. పేపర్‌ లీకైన రోజు 11 ఏండ్ల వయసున్న మా చిన్న చెల్లి నా దగ్గరకు వచ్చింది. టీవీల్లో వార్తలను చూపిస్తూ.. ‘ఇండియాలో మన భవిష్యత్తుపై ఎవ్వరికీ ఆసక్తి, శ్రద్ధ లేదు. అనవసరంగా ఎక్కువగా ఆశలు పెట్టుకోకు’ అంది. ఆమె మనసులో ఇలాంటి ఆలోచనలు వచ్చేలా చేసింది ఎవరు? ఇప్పుడు ఆమెకు నేను ఏమని సమాధానం చెప్పాలి? ‘లేదు.. లేదు.. చెల్లి.. ఈ వ్యవస్థ మనతోనే ఉన్నది’ అని అబద్ధం చెప్పాలా? నేనూ ఓ బాధితురాలినేగా.. ఇలాంటి అబద్ధపు మాటలు నేనెలా చెప్పగలను? ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో మేం చదవబోమంటూ మా చెల్లి తెగేసి చెప్పింది. ఆమె మాటలను బట్టి అభద్రతా భావం అనేది ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఇప్పుడు నెమ్మదిగా అర్థమవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఈ దేశంలో ఉండటానికి మేమెంతో గర్వపడుతున్నాం’ అంటూ నేనెలా చెప్పగలను? దేశాల మధ్య సరిహద్దులు, ఆంక్షలనేవి లేకుంటే నేను కూడా ఇండియా బయట చదివేదాన్ని. ఇది నిజం. మొత్తానికి నాకు అర్థమయ్యింది ఒక్కటే! నిబంధనలు అనేవి కాగితాల మీద పొందుపరచడానికే. కానీ, వాస్తవం మరోలా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఒకటి నిర్ణయించుకొన్నా. నీట్‌ ఎగ్జామ్‌కు కష్టపడినవారి కంటే, లీకులతో గట్టెక్కేవారు ఉండే ఇలాంటి చోట నేను ఉండలేను. కఠిన శ్రమకు ఎక్కడ విలువ ఉంటుందో ఆ ప్రపంచానికే వెళ్తా.


Smacy News 12 minutes ago
Home Flash News