బీజేపీని దాటేసిన కాక్రోచ్ జనతా పార్టీ..ఇన్‌స్టాలో హల్‌చల్!
భారత డిజిటల్ స్పేస్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) సరికొత్త రికార్డులు సృష్టిస్తూ సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువత, కొందరు సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) జస్టిస్ సూర్యకాంత్ "కాక్రోచ్(బొద్దింక)లు, సమాజానికి పరాన్నజీవులు" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశవ్యాప్త యువత నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ అవమానాన్ని ఒక గుర్తింపుగా మార్చుకుంటూ.. నిరుద్యోగ యువతకు అండగా డిజిటల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దిప్కే 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే సెటైరికల్ (పారడీ) రాజకీయ పార్టీని స్థాపించారు.
"వాయిస్ ఆఫ్ ది లేజీ అండ్ అన్‌ఎంప్లాయిడ్" (సోమరిపోతులు, నిరుద్యోగుల గొంతుక) అనే ట్యాగ్‌లైన్‌తో, 'సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజీ' సిద్ధాంతాలతో ప్రారంభమైన ఈ పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే ఏకంగా 92 లక్షల (9.2 మిలియన్లు) మంది ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోనే అత్యధిక కాలంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (8.7 మిలియన్లు) అధికారిక ఇన్‌స్టా హ్యాండిల్‌ను దాటేసింది. కేవలం లక్షల్లో నిధులు, వేలల్లో పోస్టులు పెట్టే ప్రధాన పార్టీలకు భిన్నంగా.. కేవలం మీమ్స్, రీల్స్, ఘాటైన సెటైర్లతో దూసుకుపోతున్న ఈ పేజీ, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ (13.2 మిలియన్లు) ఇన్‌స్టా ఫాలోవర్ల రికార్డును కూడా బద్దలు కొట్టేలా కనిపిస్తోంది.
ఈ పారడీ పార్టీకి ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే 3.5 లక్షల మందికి పైగా యువత సభ్యత్వం తీసుకోవడం విశేషం. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, వ్యవస్థలోని లోపాలపై యువతలో ఉన్న అసంతృప్తిని ఈ పేజీ ప్రతిబింబిస్తుండటంతో దేశవ్యాప్తంగా దీనికి భారీ మద్దతు లభిస్తోంది.