59 ఏళ్ల తర్వాత తమిళ కేబినెట్‌లోకి కాంగ్రెస్!
తమిళనాడు రాజకీయాల్లో ఒక భారీ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏకంగా 59 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామి కాబోతోంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని కేబినెట్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్వకేట్ రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్‌లను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 1967 తర్వాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952 నుంచి 1967 వరకు తమిళనాడు (అప్పటి మద్రాస్ రాష్ట్రం)లో సి.రాజగోపాలాచారి, కె.కామరాజ్, ఎమ్.భక్తవత్సలం ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ పాలన సాగింది. అయితే, 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ క్రమంగా బలాన్ని కోల్పోయింది. ఆ తర్వాత దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేలతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ ఎప్పుడూ ప్రభుత్వంలో భాగం కాలేదు. 2006-11 మధ్య డీఎంకే ప్రభుత్వంలో అధికారంలో వాటా కోసం కాంగ్రెస్ ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసి ఐదు స్థానాల్లో విజయం సాధించింది. అయితే, మే 4న విడుదలైన ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో నటుడు, రాజకీయ నాయకుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కజగం) పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఈ పొత్తులో భాగంగానే ఇప్పుడు విజయ్ కేబినెట్‌లో కాంగ్రెస్ చేరుతూ సరికొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేపింది.