బండి సంజయ్ ఇష్యూతో మాకు సంబంధం లేదు: RSS తెలంగాణ శాఖ
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై ఆర్ఎస్ఎస్ తెలంగాణ యూనిట్ స్పందించింది. ఈ మేరకు ప్రాంత సంఘచాలక్ బర్ల సుందర్ రెడ్డి గురువారం (మే 21) ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్ఎస్ఎస్పై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలను, సంఘాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థలు బద్నాం చేయడానికి ప్రయత్నించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రాంత కార్యవాహ కాచం రమేష్ జీ, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ జీల పేర్లను ప్రస్తావించడం, వారికి బండి సంజయ్‌తో ఆర్థిక లావాదేవిలు ఉన్నాయని, అందుకే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ అసత్య నిరాధార కథనాలు అల్లి కొన్ని మీడియా వర్గాలు వాస్తవ విరుద్ధమైన అంశాలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. సమాజంలో నిరంతరం నిస్వార్థంగా, ప్రజా సేవలో నిమగ్నమయ్యే లబ్ధ ప్రతిష్ఠ కలిగిన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి నిరాధారమైన వార్తలతో సంఘాన్ని, కార్యకర్తలను బద్నాం చేయాలని చూస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బీజేపీ అంతర్గత వ్యవహారాలతో ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు: భారతీయ జనతా పార్టీ (BJP) అంతర్గత, సంస్థాగత వ్యవహారాలకు సంబంధించినంతవరకు.. ఇక్కడి రాష్ట్ర బీజేపీ వ్యవహారాలను నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రమే పర్యవేక్షిస్తుంది చేస్తుంది. ఇందులో ఆర్ఎస్ఎస్ తెలంగాణ యూనిట్‌కు ఎలాంటి ప్రత్యక్ష జోక్యం ఉండదని తెలిపింది.