వికసిత్ భారత్ 2047 అనేది నినాదం కాదు.. అదో కమిట్మెంట్: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కేంద్ర మంత్రిమండలి (కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్) సుదీర్ఘ సమావేశానికి అధ్యక్షత వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ విస్తృతస్థాయి సమావేశంలో పాలనా సంస్కరణలు, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడం, ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యమైన “వికసిత్ భారత్ 2047” విజన్‌ను ముందుకు తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించారు. వీటితో పాటు ప్రస్తుతం పశ్చిమాసియా (వెస్ట్ ఆసియా)లో నెలకొన్న సంక్షోభం, దాని వల్ల దేశంపై పడే ఆర్థిక ప్రభావాల పట్ల కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఈ సమావేశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఈ చర్చలు ఎంతో "ఫలప్రదం" అయ్యాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఉమ్మడి కలని సాకారం చేయడానికి.. ప్రజల జీవన ప్రమాణాలను సులభతరం చేయడం, వ్యాపార అనుకూలతను పెంపొందించడం, సంస్కరణలను వేగవంతం చేయడంపై మంత్రులు తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారని ఆయన రాశారు. 2047 నాటికి "వికసిత్ భారత్" నిర్మాణమే ధ్యేయంగా కేంద్ర మంత్రులంతా పని చేయాలని, ఈ లక్ష్యాన్ని కేవలం ఒక నినాదంగా కాకుండా ఒక బలమైన నిబద్ధతగా భావించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలోని 'సేవా తీర్థ్' వేదికగా సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమైన ఈ సమావేశంలో కేంద్ర క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు మరియు సహాయ మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏడాది జరిగిన పూర్తి స్థాయి మంత్రిమండలి మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. కేంద్రంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వం తన మూడవ విడత పదవీ కాలంలో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. ప్రభుత్వ పనితీరుపై జరిగిన ఒక 'మిడ్‌టర్మ్ రివ్యూ' (మధ్యంతర సమీక్ష) లాగా ఈ సెషన్ సాగింది. ఇందులో క్యాబినెట్ సెక్రటరీ, నీతి ఆయోగ్ ప్రతినిధులతో పాటు 9 ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు తమ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానికి వివరణాత్మక ప్రజెంటేషన్లు ఇచ్చాయి. ఫైళ్లను అత్యంత వేగంగా పరిష్కరించిన మంత్రిత్వ శాఖలను ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించారు.