Select Location
All Locations
State
Region
City / District
ఫ్రెంచ్ కింగ్ అలెగ్జాండర్ జ్వెరెవ్.. కెరీర్‌‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం

ఫ్రెంచ్ కింగ్ అలెగ్జాండర్ జ్వెరెవ్.. కెరీర్‌‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం

పారిస్: రోలాండ్ గారోస్ (ఫ్రెంచ్ ఓపెన్) టోర్నమెంట్‌‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లంతా రెండో వారంలోనే నిష్క్రమించడంతో లభించిన అవకాశాన్ని జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ చక్కగా ఉపయోగించుకున్నాడు. ఇప్పటివరకు ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవని అత్యుత్తమ ఆటగాడిగా ఉన్న జ్వెరెవ్.. ఎట్టకేలకు ఆ అపవాదును తుడిచేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

గతంలో వరుసగా మూడు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో ఓడిపోయి తీవ్ర నిరాశకు గురైన జ్వెరెవ్‌‌ను.. నాలుగో ప్రయత్నంలో అదృష్టం వరించింది. ఆదివారం (జూన్ 07) జరిగిన పురుషుల సింగిల్స్ ఉత్కంఠభరిత ఫైనల్లో టోర్నమెంట్ టెన్త్ సీడ్, ఇటలీ ఆటగాడు ఫ్లావియో కొబొల్లిపై 6-–1, 4-–6, 6–-4, 6-–7, 6–-1 తేడాతో కష్టసాధ్యమైన విజయం సాధించాడు. జ్వెరెవ్ గత ఏడాది కాలంలో ఏ స్థాయి టోర్నమెంట్‌‌లోనూ టైటిల్ గెలవకపోవడం.. ఇప్పుడు నేరుగా ఈ మెగా టైటిల్ సాధించడం విశేషం. ప్రస్తుతం ప్రపంచ మూడో నంబర్ ఆటగాడైన జ్వెరెవ్‌‌కు.. కెరీర్‌‌లో పెద్ద మ్యాచ్‌‌లు ఆడినప్పుడు చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. కోవిడ్ సమయంలో జరిగిన 2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో డొమినిక్ థీమ్ చేతిలో ఓడిపోయాడు. 

2024 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్‌‌పై 2-1 తో సెట్ల ఆధిక్యంలో ఉండి చివరి రెండు సెట్లలో చేతులెత్తేశాడు. ఇక 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జాన్నిక్ సినర్ చేతిలో ఘోర పరాజయం చవిచూశాడు. గత ముగ్గురు ప్రత్యర్థులతో పోలిస్తే కొబొల్లికి అంతగా అనుభవం లేకపోయినప్పటికీ.. మైదానంలో అతడి కదలికలు, షాట్ల ఎంపిక జ్వెరెవ్‌‌కు గట్టి సవాలు విసిరాయి. ఇద్దరు ఆటగాళ్లకు ఇదొక కఠినమైన పరీక్షగా నిలిచింది. నిర్ణయాత్మక ఐదో సెట్‌‌లో జర్మనీ ఆటగాడు పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌‌ను చేజిక్కించుకున్నాడు. కొబొల్లి కొట్టిన ఆఖరి షాట్ లైన్ దాటి బయటకు వెళ్లగానే.. జ్వెరెవ్ ఆనందంతో కోర్టులోనే కుప్పకూలి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడటంతో భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం 29 ఏళ్ల వయసున్న జ్వెరెవ్.. టెన్నిస్ చరిత్రలో అత్యంత ఎక్కువ వయసులో తన మొదటి మేజర్ (గ్రాండ్ స్లామ్) టైటిల్ గెలిచిన ఏడో పురుష ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.


V6 News 5 hours ago
Home Flash News