ఉక్రెయిన్‌లో శాంతి కోసం భారత సైన్యం..జేడీ వాన్స్ సూచన..ఇండియా అలాంటి ఖర్చు చేయదంటూ ట్రంప్ సెటైర్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షణ దళాలను పంపే అంశంపై చర్చ సమయంలో అమెరికాలోని వైట్‌హౌస్‌లో భారత్ ప్రస్తావన వచ్చింది. ఉక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలైతే శాంతి పరిరక్షణ దళాలుగా భారత సైన్యాన్ని పంపాలని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎదుట వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సూచన చేశారు.
న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు మ్యాగీ హాబెర్మన్, జొనాథన్ స్వాన్ రాసిన ‘ఇన్‌సైడ్ ది ఇంపీరియల్ ప్రెసిడెన్సీ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్’ అనే పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. 2025 జనవరి 30న వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించేందుకు నాటో దేశాలకు బదులుగా యూరప్‌కు చెందని దేశాల సైన్యాన్ని వినియోగిస్తే బాగుంటుందని అన్నారు. అందుకు భారత్, సౌదీ పేర్లను సూచించారు. దీనికి ట్రంప్ కలగజేసుకుని.. ‘భారతీయులు అలా చేయరు. అలాంటి వ్యవహారాల కోసం ఖర్చు పెట్టరు’ అని నవ్వుతూ కామెంట్ చేసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు.