Select Location
All Locations
State
Region
City / District
వెదురు కర్రలతో ప్రాక్టీస్.. తండ్రి వారసత్వంతో అంతర్జాతీయ వేదికపై మెరిసిన యశ్వీర్‌

వెదురు కర్రలతో ప్రాక్టీస్.. తండ్రి వారసత్వంతో అంతర్జాతీయ వేదికపై మెరిసిన యశ్వీర్‌

జావెలిన్ త్రో అనగానే.. మనకు ఠక్కున గుర్తుకొచ్చే పేరు నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి ఈ క్రీడ వైపు భారత అభిమానుల చూపు మళ్లేలా చేశాడు. ఆ తర్వాత పారిస్‌లోనూ పతకంతో మెరిశాడు. ఎక్కడ పోటీ ఉన్నా నీరజ్‌కు ఓ పతకం ఖాయమనేలా చేసుకున్నాడు. ఇప్పుడు అతడితోపాటు భారత ఆశలను మోసి పతకం సాధించాడు మరో జావెలిన్‌ త్రో అథ్లెట్. అతడే 24 ఏళ్ల యశ్వీర్ సింగ్‌ (Yashvir Singh). కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) రజతం నెగ్గితే.. యశ్వీర్‌ సింగ్ కాంస్య పతకం సాధించాడు. హేమాహేమీలైన అండర్సన్ పీటర్స్, అర్షద్‌ నదీమ్, కెషోర్న్‌ వాల్‌కట్‌ను అధిగమించి మరీ యశ్వీర్ పోడియం ఎక్కాడు. అతడు వేసిన తొలి త్రోనే ఫౌల్‌గా మారగా.. మళ్లీ నాలుగోది కూడా కోల్పోయాడు. అప్పటికి 81.33 మీటర్లు విసిరి రేసులో ఉన్నా.. అది సరిపోలేదు. 

చివరి త్రో వేసేందుకు సిద్ధమైన తరుణంలో నీరజ్‌ ఇచ్చిన మద్దతు యశ్వీర్‌కు సాయపడింది. తన రన్నప్‌ను మార్చుకొని విసిరాడు. ఈసారి ఏకంగా 85.41 మీటర్లు దూరం వేయడంతో మూడో స్థానం ఖాయమైంది. నీరజ్‌ (85.83 మీటర్లు)తో పోలిస్తే ఈ దూరం కాస్తే తక్కువ. తండ్రి బాటలోకి.. రాజస్థాన్‌లోని జైపుర్‌ ప్రాంతానికి చెందిన యశ్వీర్ చిన్నతనంలో బాస్కెట్‌బాల్ ఆడేవాడు. ఫిట్‌నెస్‌ కోసం ఆ గేమ్‌ను ఎంచుకున్నాడు. తర్వాత జావెలిన్‌ త్రో క్రీడకు మారిపోయాడు. మొదట్లో వెదురుబొంగు కర్రలతో ప్రాక్టీస్ చేసేవాడు. ప్రొఫెషనల్‌గా మారే ముందు వరకూ అతడికి అవే అస్త్రాలు. తన తండ్రి రాయ్‌ సింగ్‌ కూడా జాతీయ స్థాయి జావెలిన్‌ త్రో అథ్లెట్. ఆయన మార్గదర్శకంలోనే యశ్వీర్ మెలకువలు నేర్చాడు. ‘కఠిన శ్రమ ఎల్లప్పుడూ ఫలితాలను ఇస్తుంది’.. ఇదే యశ్వీర్‌కు తండ్రి నూరిపోసిన సూత్రం. ‘‘మా ట్రైనింగ్‌లో ప్రత్యేకత ఏమీ ఉండదు. కానీ, ఎక్కువ సమయం సాధన చేసేవాళ్లం. సరైన ఆహారం తీసుకోవడం, ప్రాక్టీస్ చేయడం ఇదే పని. నేను అథ్లెట్‌గా ఉన్నప్పుడు చాలా పొరపాట్లు చేశా. కానీ, నా కుమారుడి విషయంలో అలా చేయకుండా ఉండేందుకు తర్ఫీదునిచ్చా’’ అని రాయ్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


Eenadu Telugu 1 hour ago
Home Flash News