ఇరాన్ యుద్ధం నుంచి ఇక బయటపడదాం: ట్రంప్ టాప్ జనరల్ సలహా..!
ఇంటర్నెట్ డెస్క్: గత ఐదు నెలలుగా ఇరాన్‌తో సాగిస్తోన్న యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని స్వదేశంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్య జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ ట్రంప్ (Donald Trump) కార్యవర్గానికి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధం (US-Iran War) నుంచి ఇకనైనా బయటపడాలని.. లేదంటే ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
‘‘ఇరాన్‌తో యుద్ధం స్వల్పకాలికంగా ఉండాల్సింది. ఇప్పటికే అది ఆ దశను దాటేసింది. పశ్చిమాసియలో ఘర్షణలు తీవ్రతరం చేయడానికి మనకు అందుబాటులో ఉన్న సైనిక చర్యలు ప్రతికూల ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉంది. కేవలం వైమానిక శక్తితోనే నిర్దేశిత లక్ష్యాలను మనం సాధించలేం. అందుకే ఇకనైనా, ఈ యుద్ధం నుంచి బయటకు వచ్చే మార్గాలను అన్వేషించాలి’’ అని ట్రంప్ సలహాదారులకు డాన్ కేన్ ప్రైవేటుగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి ఆయన పలువురు క్యాబినెట్ అధికారులు, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తోనూ చర్చలు జరిపారట.