Select Location
All Locations
State
Region
City / District
వాణిజ్య చర్చలు విఫలం.. నో డీల్‌.. ఇక ట్రేడ్‌ వార్‌

వాణిజ్య చర్చలు విఫలం.. నో డీల్‌.. ఇక ట్రేడ్‌ వార్‌

అమెరికా–కెనడా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. మూడు రోజుల పాటు కొనసాగిన వాణిజ్య ఒప్పందం కోసం జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. చర్చలు విఫలం కావడంతో.. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం సుంకాలను విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టారిఫ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని అమెరికా అధికారులు వెల్లడించారు.

కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ఈ పరిణామంపై స్పందిస్తూ.. అమెరికా నిర్ణయానికి సమాన స్థాయిలో ప్రతీకార చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల ప్రకారం.. శనివారం అర్ధర్రాతి నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి. అయితే అమెరికా విధించే ప్రతి డాలర్‌ టారిఫ్‌కు ప్రతిగా కెనడా కూడా అంతే మొత్తంలో సుంకాలు విధిస్తుందని కార్నీ స్పష్టం చేశారు. చివరి దశలో విఫలమైన చర్చలు అమెరికా–కెనడా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం మూడు రోజుల పాటు వాషింగ్టన్‌లో చర్చలు జరిగాయి. కెనడా వాణిజ్య మంత్రి డొమినిక్‌ లెబ్లాంక్‌, అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్‌ గ్రీర్‌ చర్చల్లో పాల్గొన్నారు. ప్రారంభంలో ఇరు దేశాలు ఒప్పందానికి దగ్గరయ్యాయని భావించినా.. కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలు విఫలమైన తర్వాత కెనడా చర్చలను తాత్కాలికంగా నిలిపివేసి, తమ ప్రతినిధులను తిరిగి ఒట్టావాకు రావాలని ప్రధాని కార్నీ ఆదేశించారు.

ఏ వస్తువులపై ప్రభావం? అమెరికా విధించనున్న 50 శాతం టారిఫ్‌లు దాదాపు 20 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.7 లక్షల కోట్లకు పైగా) విలువైన కెనడా ఉత్పత్తులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్‌, ఉక్కు, అల్యూమినియం, కలప వంటి రంగాలకు ఈ నిర్ణయం భారీ దెబ్బగా మారే అవకాశం ఉంది. అమెరికా అధికారులు మాత్రం కెనడా కోరిన కొన్ని రాయితీలకు అంగీకరించలేదని తెలిపారు. ముఖ్యంగా కార్ల తయారీ రంగం, స్టీల్‌, అల్యూమినియం, లంబర్‌ రంగాల్లో కెనడా డిమాండ్లపై విభేదాలు కొనసాగినట్లు వెల్లడించారు. "కెనడా ప్రయోజనాల కోసం పోరాడతాం": కార్నీ అమెరికాతో ఒప్పందం కుదరకపోయినా.. తమ దేశ కార్మికులు, వ్యాపారాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మార్క్‌ కార్నీ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా చూసేందుకు ప్రయత్నించామని, అయితే కెనడా ప్రయోజనాలకు విరుద్ధమైన ఒప్పందాన్ని అంగీకరించబోమని పేర్కొన్నారు. ట్రంప్‌ హెచ్చరిక కెనడా ప్రతీకార టారిఫ్‌లు విధిస్తే..

పరిస్థితిని సమతుల్యం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్‌ పరిపాలన హెచ్చరించింది. "వాళ్ల చర్యను సమం చేసేందుకు.. మరోసారి కఠిన చర్యలు తీసుకుంటాం" అని అమెరికా అధికారి వ్యాఖ్యానించారు. రెండు దేశాలపై ప్రభావం అమెరికా–కెనడా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యాల్లో ఒకటి. ఇరు దేశాల మధ్య ప్రతి ఏడాది వందల బిలియన్‌ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతుంది. తాజా టారిఫ్‌ల నిర్ణయం అమల్లోకి వస్తే.. వినియోగదారులపై ధరల భారం పెరగడం, పరిశ్రమల సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెరికా ఇతర దేశాలపై టారిఫ్‌ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో.. కెనడాతో తాజా వివాదం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముంది.


Sakshi 1 hour ago
Home Flash News