దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్17 .. తొలిసారి 36 వేల కి.మీ. ఆర్బిట్‌లోకి ఇస్రో ఇమేజింగ్ శాటిలైట్
శ్రీహరికోట(ఆంధ్రప్రదేశ్):భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్(జీటీవో)లోకి తొలిసారి భూ పరిశీలక ఉపగ్రహం(ఇమేజింగ్ శాటిలైట్)ను విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు అధునాతన ‘ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోస్)–05’ని మోసుకుని జీఎస్‌ఎల్‌వీ ఎఫ్17 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా18 నిమిషాల తర్వాత శాటిలైట్‌ను నిర్దేశించిన సబ్-జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. మిషన్ విజయవంతం అయిందని, 2,367 కిలోల బరువున్న శాటిలైట్‌ను రాకెట్ కచ్చితత్వంతో అనుకున్న కక్ష్యలోకి చేర్చిందని ఇస్రో ప్రకటించింది.
ఇప్పటివరకూ ఇస్రో ఈవోస్ ఉపగ్రహాలన్నీ లో ఎర్త్ ఆర్బిట్‌లోకి మాత్రమే చేర్చగా.. ఇప్పుడు భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జియోసింక్రనస్ ఆర్బిట్‌లోకి ఇమేజింగ్ శాటిలైట్‌ను పంపించింది. ఈ కక్ష్యలోకి చేర్చడం వల్ల శాటిలైట్ భూభ్రమణ వేగానికి సమానంగా ప్రయాణిస్తూ ఉంటుంది. అలాగే, జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు ఇది19వ మిషన్ కాగా, 2,300 కిలోల కన్నా ఎక్కువ బరువున్న శాటిలైట్‌ను జీఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లడం కూడా ఇదే మొదటిసారి. కాగా, ఇస్రో 2021లో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్-10/ఈఎస్‌ఓఎస్-–03 మిషన్ ఫెయిల్ అయింది. ఆ సమయంలో ప్రయోగం ప్రారంభమైన 307వ సెకనులో ఆన్‌బోర్డ్ కంప్యూటర్ ఆ మిషన్‌ను రద్దు చేసింది. క్రయోజనిక్ అప్పర్ స్టేజ్‌లోని లోపం మిషన్ వైఫల్యానికి దారితీసిందని ఇస్రో తెలిపింది. ఇప్పుడు ఆ మిషన్‌కు ఆల్టర్నేటివ్‌గానే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17/ఈఎస్‌ఓఎస్–-05 మిషన్‌ను ఇస్రో చేపట్టి విజయం సాధించింది. అలాగే, ఈ ఏడాది జనవరి 12న 16 శాటిలైట్‌లను మోసుకెళ్తున్న ఇస్రో పీఎస్‌ఎల్‌వీ- సీ62 రాకెట్ మూడవ దశలో విఫలమై.. శాటిలైట్లను ఉద్దేశించిన కక్ష్యలోకి చేర్చడంలో విఫలమైంది. తాజాగా 8 నెలల తర్వాత ఈ మిషన్ సక్సెస్ కావడంతో.. ఈ ఏడాది ఇస్రోకు ఇదే తొలి విజయంగా నిలిచింది.
ఈవోఎస్5 శాటిలైట్ ‘ఆకాశంలో కన్ను’ అని ఈ మిషన్‌లో పాలుపంచుకున్న సీనియర్ సైంటిస్టులలో ఒకరు అభివర్ణించారు. ఇది రియల్ టైమ్ ఇమేజ్‌లను అందించడానికి, వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాలలో దేశానికి సహాయపడటానికి ఉద్దేశించినదని తెలిపారు. అయితే, ఇది అధునాతన ఇమేజింగ్ శాటిలైట్ మాత్రమేనని.. ‘స్పై శాటిలైట్ (గూఢచారి ఉపగ్రహం)’ అనే ఊహాగానాల్లో వాస్తవం లేదని ఇస్రో చీఫ్ వి. నారాయణన్ స్పష్టం చేశారు. ఈ మిషన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందన్నారు. ‘‘శ్రీహరికోట నుంచి ఇది 107వ రాకెట్ ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీకి సంబంధించి ఇది 19వ మిషన్” అని ఆయన తెలిపారు. ఈఎస్‌ఓఎస్-–05 కక్ష్యలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత, ఇది దేశం కోసం జియో ఆర్బిట్ నుంచి "వ్యూహాత్మక సమాచారాన్ని" అందించే మొట్టమొదటి డెడికేటెడ్ ఇమేజింగ్ శాటిలైట్‌గా మారుతుందన్నారు. కాగా, ఈ ఏడాదిలోనే మానవరహిత గగన్‌యాన్ మిషన్, నావిగేషన్ శాటిలైట్ ఎన్‌వీఎస్-03 తో పాటు మరో ఆరు ప్రయోగాలు కూడా చేపట్టనున్నట్టు ఇస్రో చీఫ్ వెల్లడించారు.
దేశంలోనే తొలిసారిగా జియో-ఆర్బిట్‌లోకి ఇమేజింగ్ శాటిలైట్‌ను ప్రయోగించిన ఇస్రోను కాంగ్రెస్ పార్టీ అభినందించింది. ఈ మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, పరిశోధకులను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులు జైరామ్ రమేశ్, ప్రియాంక గాంధీ అభినందించారు. ఆధునిక భారతదేశ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో మన అంతరిక్ష కార్యక్రమానికి పునాదులు వేశారని ఖర్గే గుర్తుచేశారు. తరతరాలుగా మన శాస్త్రవేత్తలు ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ శాస్త్రీయ దృక్పథానికి, అంతరిక్ష పరిశోధనలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.