Tejashwi Yadav: ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీకి నూతన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) నియమితులయ్యారు. ఆర్జేడీ కీలక సమావేశంలో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ నియామకాన్ని ప్రకటించారు. పార్టీ అగ్రనేతల సమక్షంలో తేజస్వీకి నియామక లేఖను అందజేశారు. లాలూ కుటుంబంలో వివాదాలు చెలరేగుతున్న సమయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిల చిన్న కుమారుడైన తేజస్వీ పార్టీలో ముఖ్య నేతగా కొనసాగుతున్నారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ బిహార్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించడంలో తేజస్వీ కీలక పాత్ర పోషించాడు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారాల్లో చురుకుగా పాల్గొన్నారు. రాఘోపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, భాజపా అభ్యర్థి సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల తేడాతో నెగ్గారు.