Harish Rao: సైట్ విజిట్ నిబంధన పెట్టిన అన్ని టెండర్లూ రద్దు చేయాలి: హరీశ్‌రావు
హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి సీఎం రేవంత్‌ను బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు యత్నించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish rao) విమర్శించారు. ఈ స్కామ్‌ను బయటపెట్టిన తమ పార్టీపై బురద జల్లుతున్నారన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు.
‘‘2025 మేలో సైట్ సర్టిఫికెట్ నిబంధన వచ్చింది. దీని తొలి లబ్ధిదారు సీఎం బంధువు, శోధా కన్‌స్ట్రక్షన్ యజమాని సృజన్‌రెడ్డి.
ఆ తర్వాత అన్ని టెండర్లకు సైట్ విజిట్ నిబంధన పెట్టారు. ప్రతి టెండర్‌కు ప్లస్ టెన్ పద్ధతి ఫాలో అయ్యారు. స్కామ్‌లు జరగలేదని నమ్మించేందుకు భట్టి విక్రమార్క ప్రయత్నిస్తున్నారు. నైనీ కోల్ బ్లాక్ ఒక్కటే కాదు.. పారదర్శకత, నిజాయతీ ఉంటే సైట్ విజిట్ నిబంధన పెట్టిన అన్ని టెండర్లూ రద్దు చేయాలి. 2025 మే నుంచి ఎన్ని టెండర్లు పిలిచారు.. ఎంతమందికి సర్టిఫికెట్ ఇచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. తమకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని.. కావాల్సిన వారికే ఇచ్చారని జీసీసీ, మహాలక్ష్మి వంటి అనేక కంపెనీలు ఫిర్యాదు చేశాయి. నా వద్ద ఫొటోలు, వీడియోలు, మెయిల్స్ ఉన్నాయి. విచారణకు ఆదేశిస్తే ఆధారాలు ఇస్తా. సమయం వచ్చినప్పుడు అవన్నీ బయటపెడతా’’ అని హరీశ్‌రావు అన్నారు.