‘సలార్ 2’ ఆశ్చర్యపరుస్తుంది: నిర్మాత విజయ్ కిరగందూర్
ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందిన ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్1: సీజ్ ఫైర్’. దీనికి సీక్వెల్‌గా ‘శౌర్యాంగ పర్వం’ రానున్న విషయం తెలిసిందే. పార్ట్ 2పై (Salaar 2) అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నిర్మాత విజయ్ కిరగందూర్ ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించారు. ‘‘సలార్ 2 అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీని అప్‌డేట్స్ కోసం వరుసగా అభిమానులు పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. అవి మా దృష్టికి కూడా వచ్చాయి. త్వరలోనే దీని షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ విషయం మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
గతంలో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ‘సలార్’ పార్ట్ 1 గురించి చేసిన కామెంట్స్‌పై నిర్మాత మాట్లాడారు. సలార్ తన అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందని.. కానీ, ఆ చిత్రానికి వచ్చిన ఆదరణ తనకు సంతోషాన్నిచ్చిందని దర్శకుడు గతంలో అన్నారు. దీనిపై నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో గొప్ప దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. స్వీయవిమర్శ చేసుకోవడంలో ముందుంటారు. ‘సలార్’ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఓటీటీలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది’’ అని చెప్పారు.