చమురు ధర త్వరలోనే 100 డాలర్లు ? భారత్పై భారం ఎక్కువే
న్యూఢిల్లీ: యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. అమెరికా వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 3.19 శాతం పెరిగి 67.29 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడ్ 72.87 డాలర్లకు చేరుకుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధర బ్యారెల్ కు 100 డాలర్లను తాకుతుందని బార్క్లేస్ బ్యాంక్ అంచనా వేసింది.
ధర ఈ స్థాయికి చేరితే మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధర రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ చమురు ధర 120 డాలర్ల దాకా వెళ్లినప్పటికీ ఆ తర్వాత తగ్గింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా ఉన్న హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు పట్టు ఉండటంతో చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళన పెరిగింది.
దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ పై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఇంధన ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు కరెంట్ అకౌంట్ లోటు ఎగిసే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ వద్ద 76 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఓపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచితే మార్కెట్ పై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
మనదేశం రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వాడుతుంది. ఇందులో రెండు మిలియన్బ్యారళ్లు హార్ముజ్ మీదుగానే వస్తోంది. క్రూడ్ ధర ఒక్క డాలర్ పెరిగినా.. ఏటా ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భారం పడుతుంది. గత ఏడాది మనదేశం 160 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్‌ను కొనుగోలు చేసింది.