పాక్ భద్రతా దళాల కాల్పుల్లో67 మంది అఫ్గాన్ తాలిబన్లు మృతి
మొత్తం 435 మంది తాలిబన్లను చంపాం: పాక్ మంత్రి అత్తౌల్లా తరార్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ భద్రతా దళాలు రాత్రిపూట జరిపిన ఆపరేషన్లలో మరో 67 మంది అప్గాన్ తాలిబాన్ సిబ్బంది మృతిచెందారు. మంగళవారం తెల్లవారుజామున పాక్, అప్గాన్ సరిహద్దులోని 16 ప్రదేశాల్లో తాలిబన్ల దాడులను తిప్పికొట్టాయని అధికారులు తెలిపారు. అప్గాన్ తాలిబాన్ దాడులకు ప్రతిస్పందనగా ఫిబ్రవరి 26న పాకిస్తాన్‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’ ను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆ దేశ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ వెల్లడించారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని సరిహద్దు ప్రాంతంలో రాత్రిపూట జరిపిన ఆపరేషన్లలో 40 మంది అప్గాన్ తాలిబాన్ సిబ్బంది మరణించారని తరార్ చెప్పారు. పాక్ భద్రతా దళాలుఒక చోట భౌతిక దాడి, 12 ప్రదేశాలపై కాల్పులు జరిపి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా తిప్పికొట్టాయని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే, అప్గాన్ తాలిబన్లు బార్డర్ అవతల నుంచి ఉత్తర బలూచిస్తాన్‌లోని ఖిల్లా సైఫుల్లా, నోష్కి, చమన్ జిల్లాల్లోని 16 ప్రదేశాలపై భౌతిక దాడులకు దిగారని.. పాకిస్తాన్ దళాలు 25 ప్రదేశాలపై కాల్పులు జరిపాయని ఆయన తెలిపారు
. అన్ని ప్రదేశాల్లోనూ దాడులను తిప్పికొట్టామని, ఈ దాడుల్లో అప్గాన్ తాలిబన్లు 27 మంది మరణించారని, అనేక మంది గాయపడ్డారని ఆయన చెప్పారు. అలాగే, ఈ ఆపరేషన్లలో పాకిస్తాన్ నార్త్‌లోని పారామిలిటరీ ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్ సీ)కి చెందిన ఒక సోల్జర్ మరణించగా, ఐదుగురు సైనికులు గాయపడ్డారని మంత్రి వెల్లడించారు.