LPG Gas Cylinders: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
AP Minister Nadendla Manohar | ఇరాన్, అమెరికా - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రజలకు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
అమరావతి: ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతోంది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, ఏపీలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) గుడ్ న్యూస్ చెప్పారు. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు.
ఏపీలో పుష్కలంగా గ్యాస్ నిల్వలు
ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలోని గ్యాస్ నిల్వలపై సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, గృహ అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని, కేవలం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు, అధికారుల ప్రకటనలు మాత్రమే నమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గ్యాస్ సరఫరాలో ఏ ఇబ్బంది లేదు..
గ్యాస్ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, విశాఖపట్నం రిఫైనరీ, మంగళూరు- హస్సన్- చర్లపల్లి పైప్‌లైన్ ద్వారా సరఫరా సజావుగానే సాగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒకవేళ నిల్వలలో ఏదైనా తేడా వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఎల్పీజీ గ్యాస్ గృహ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే తమ మొదటి ప్రాధాన్యత అని, అవసరమైతే వాణిజ్య అవసరాలకు ఇచ్చే సరఫరాను క్రమబద్ధీకరించి ప్రజలకు అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు.