... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
తమిళనాట.. ఒంటరి పోరుకు విజయ్‌ సిద్ధం

తమిళనాట.. ఒంటరి పోరుకు విజయ్‌ సిద్ధం

ఈనాడు, చెన్నై: తమిళనాడులో తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన సినీనటుడు విజయ్‌ ఎన్నికల్లో గెలుపు ధీమాతో ముందుకెళ్తున్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. బలమైన డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తామని ప్రకటిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ ప్రభావం గట్టిగా ఉండబోతుందని, ద్రావిడ పార్టీల ఓటు బ్యాంకును కొల్లగొట్టే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.

తమిళనాట ఇప్పటి వరకు ఉన్న పార్టీలు సామాజిక వర్గాలను నమ్ముకొని పావులు కదిపాయి. విజయ్‌ అవేవీ పట్టించుకోకుండా యువత, మహిళల ఓట్లపై దృష్టిపెట్టారు. ఆయన ఉపన్యాసాలకు, హామీలకూ 25 ఏళ్లలోపు వారు ఎక్కువ ఆకర్షితులవడం కలిసొచ్చే విషయం. మహిళలకూ ఏకంగా 13 హామీలిచ్చారు. ముఖ్యంగా ఏడాదికి 6 ఉచిత వంట గ్యాస్‌ సిలిండర్లు, నెలవారీ సాయంగా రూ.2,500, అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పిల్లల్ని చదివిస్తే ఏటా రూ.15 వేలు, యువతుల పెళ్లికి 8 గ్రాముల బంగారం, చీర ఇచ్చే పథకాలను తీసుకొస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో డీఎంకే అవినీతి మితిమీరిందని విజయ్‌ పలుమార్లు విమర్శించారు. రెండు ప్రధాన కూటములకు ప్రత్యామ్నాయం తానేనని ప్రకటించారు. తమిళనాడులో ద్రావిడ విధానాలకే ఓటర్లు మొగ్గుచూపుతారని గుర్తించి పెరియార్, అంబేడ్కర్, కామరాజర్‌ భావజాలాలతో తన పార్టీ నడుస్తోందని ప్రతి సభలోనూ చెబుతున్నారు. ద్వి భాషా విధానానికే మొగ్గుచూపారు. లౌకికవాద సిద్ధాంతాల్ని కాపాడతానని హామీ ఇచ్చారు.

విజయ్‌కి ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ. విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరుతో ఫ్యాన్‌ క్లబ్‌ల ఏర్పాటు.. స్థానిక ఎన్నికల్లో పోటీకి నిలిచిన అనుభవం కేడర్‌కు ఉంది. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎంతోమంది అభిమానుల్ని కూడగట్టుకున్నారు. ఆ అండతోనే ఇప్పటికే 70 వేల మంది బూత్‌ ఏజెంట్లను నియమించారు. వీరితో 1.5 కోట్ల సభ్యత్వ నమోదు చేయించారు. ఈ ఉత్సాహమే గతేడాది నిర్వహించిన సభలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చేలా చేసింది.

విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చాక ప్రతికూల పరిస్థితులు చాలా ఎదురవుతున్నాయి. తాజాగా విడాకుల సమస్యతో కోర్టుకెక్కడం, ఓ నటితో సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. గతేడాది కరూర్‌ తొక్కిసలాట ఘటనతోనూ చిక్కుల్లో పడ్డారు. బాధిత కుటుంబాల్ని నేరుగా కలవకుండా, పిలిపించుకొని పరిహారం ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. అధికారంలో భాగస్వామ్యం ఇస్తామని విజయ్‌ ప్రకటించినప్పటికీ.. ఆయన చుట్టూ అల్లుకున్న ప్రతికూల పరిస్థితులతో ఎవరూ ఇష్టపడటంలేదనే అపవాదూ ఉంది. మరోవైపు జాతీయ పార్టీలకు ఆయన ‘బీ-టీమ్‌’ అనే విమర్శలు ఉన్నాయి. ఇవేకాక.. ఎమ్మెల్యేలుగా గెలిచేంత ఓట్లు తెచ్చుకునే పరపతి క్యాడర్‌కు ఉందా? అనేది ప్రధాన ప్రశ్న.

Source : Eenadu Telugu

1 hour ago

Home Flash News