హౌస్ కమిటీపై అసెంబ్లీలో గందరగోళం .. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి.. బీఆర్ఎస్ నిరసన
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రాఘవ కన్ స్ట్రక్షన్ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని స్పీకర్ పోడియం చుట్టూ చేరి నిరసన తెలిపారు. జీవో 111ను ఉల్లంఘిస్తూ అక్రమ దందా కొనసాగిస్తోందని ఆరోపించారు.
అనంతరం కల్గజేసుకున్న మంత్రి శ్రీధర్ బాబు .. సభ సజావుగా జరిగేందుకు బీఆర్ఎస్ సభ్యులు సహకరించాలని కోరారు. రాఘవ కన్ స్ట్రక్షన్ మైనింగ్ పై మంత్రి వివేక్ విచారణ జరపిస్తామని చెప్పారన్నారు. మళ్లీ హౌస్ కమిటీ ఎందుకని ప్రశ్నించారు. తప్పు జరిగితే బాధ్యులు ఎవరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కావాలనే సభను అడ్డుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. రాఘవ కన్ స్ట్రక్షన్ మైనింగ్ పై బీఆర్ఎస్ దగ్గర ఆధారాలుంటే సీబీ సీఐడికీ ఇవ్వాలని సూచించారు శ్రీధర్ బాబు.
అంతకు ముందు గన్ పార్క్ దగ్గర నిరసనకు దిగారు బీఆర్ఎస్ సభ్యులు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి కుటుంబం స్కాం బయట పెట్టే సరికి ప్రభుత్వం బిత్తర పోయింది. ముఖ్యమంత్రి వాటా ఉన్నందుకు చర్య తీసుకోవడం లేదా..? అక్రమం జరిగింది వాస్తవమని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి దూరపు బంధువులదని సీఎం అంటున్నారు. రెండున్నర ఏళ్లుగా ప్రజలకు పనికివచ్చే ఒక పని కూడా చేయట్లేదు. మంత్రి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మంత్రి కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నారు..?. కొకాపేటలో భాగ్యలక్ష్మి మైనింగ్ ముఖ్యమంత్రి బంధువులది. 1800 కోట్లు ఆదాయం రావాలి..వస్తున్నది 900 కోట్లు. మిగతావి ఎవరి జేబు లోకి పోతున్నయ్ . వేల కోట్ల అవినీతి చేయకపోతే ఎందుకు సభను వాయిదా వేస్తున్నారు. ప్రభుత్వం ఆడిస్తున్నట్టు బిజెపి ఆడుతుంది. ప్రైవేట్ భూములను కబ్జా చేస్తున్నారు. మేము వదిలిపెట్టం..మెట్రో పై స్టేట్మెంట్ చాలా తప్పుగా ఉంది. ముఖ్యమంత్రి సభలో తప్పుడు లెక్కలు చెబుతున్నారు. 280 ఎకరాలు ఎల్ అండ్ టి కి లీజు కి ఇచ్చాం.. ఆ భూమిని కొట్టేయడానికి దండు పాళ్యం బ్యాచ్ కుట్ర పన్నుతోంది. మంత్రి పొంగులేటిని భర్తరఫ్ చేయాల్సిందే. ప్రభుత్వం దిగిరాకపోతే గవర్నర్ ను కలుస్తాం. గవర్నర్ ను కలిసి పొంగులేటిని భర్తరఫ్ చేయాలి అని వ్యాఖ్యానించారు కేటీఆర్.