అమరావతికి చట్టబద్ధత.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక: మంత్రి కొండపల్లి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో చరిత్రాత్మక తీర్మానం చేయడం పట్ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక తీర్మానం మాత్రమే కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, అమరావతిని శాశ్వత రాజధానిగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇవాల్టి తీర్మానం ద్వారా రాజధాని నిర్మాణానికి ఉన్న అన్ని న్యాయపరమైన, పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగిపోతాయని, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్దత ప్రక్రియ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతుల పోరాటం, వారి త్యాగం వృథాగా పోదని ఈ తీర్మానం నిరూపించిందన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం, అభివృద్ధిని ఇక్కడి నుంచే పరుగులు పెట్టిస్తామని, కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఐటీ హబ్‌లు, పారిశ్రామికాభివృద్ధి ద్వారా అమరావతిని ప్రపంచపటంలో నిలుపుతామన్నారు. రాజధానిపై స్పష్టత రావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోందని చెప్పారు. పారిశ్రామికవేత్తలు ధైర్యంగా ముందుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.