శాంతి కావాలంటే..మేం చెప్పినట్లు వినాలి: గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల (Gulf countries)పై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) తమ పొరుగు దేశాలకు హెచ్చరికలు చేశారు. గల్ఫ్ దేశాల్లో దాడులు ఆగాలన్నా.. శాంతి, అభివృద్ధి నెలకొనాలన్నా తాము చెప్పినట్లు వినాలన్నారు. ఆయా దేశాల గగనతలాలను వినియోగించుకొని శత్రువులు తమపై దాడి చేస్తున్నారన్నారు. తమ గగనతలాలను వినియోగించుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్‌లకు అనుమతి ఇవ్వొద్దని బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఇతర పశ్చిమాసియా దేశాలకు సూచించారు.
తాము ఏ దేశంపైనా ముందస్తు దాడులు చేయబోమని అనేక సార్లు స్పష్టం చేసినట్లు పెజెష్కియాన్ పేర్కొన్నారు. కానీ తమ మౌలిక సదుపాయాలు, అణు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమని.. ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. శత్రు స్థావరాలు భూస్థాపితం అయ్యే వరకు దాడులు కొనసాగిస్తామన్నారు. శత్రువులకు సహకరించిన వారిని కూడా వదలబోమన్నారు.
భారత్ సహా తమ మిత్రులైన ఐదు దేశాల నౌకల కోసం హర్మూజ్ (Hormuz) జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఎల్పీజీని మోసుకొస్తున్న మరో రెండు భారత నౌకలు శనివారం హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 90,000 టన్నులకు పైగా ఎల్‌పీజీ (వంటగ్యాస్)ని తీసుకువస్తున్న బీడబ్ల్యూ ఈఎల్ఎం, బీడబ్ల్యూ టీవైఆర్ అనే రెండు నౌకలు హర్మూజ్‌ను దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయన్నాయి. మరో ఐదు భారతీయ ట్యాంకర్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమీపంలోని జలాల్లో ఇరాన్ అనుమతి కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది.