వంటగ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం..
గతంలో కిరోసిన్ రహిత రాష్ట్రాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు దాని సరఫరాను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఢిల్లీ, హరియాణా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ సహా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (ఎస్‌కేఓ) అందుబాటులోకి రానుంది.
నిబంధనలు సడలించినప్పటికీ భద్రత విషయంలో కేంద్రం కఠినంగా ఉన్నట్లు చెప్పింది. ‘పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) జారీ చేసిన భద్రతా ప్రోటోకాల్‌లు యధావిధిగా వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సూచించిన నిర్దేశిత అవుట్‌లెట్ల ద్వారా మాత్రమే పంపిణీ జరుగుతుంది. ఈ కిరోసిన్‌ను కేవలం వంట, దీపాల వంటి గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి’ అని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభం దృష్ట్యా గృహాలపై వంటగ్యాస్ భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పీడీఎస్ కింద కిరోసిన్ సరఫరాను నిలిపివేసిన చోట కూడా ప్రస్తుతం ఉన్న రిటైల్ నెట్‌వర్క్‌ను వాడుకుని తక్షణమే సరఫరాను పునరుద్ధరించడం ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కొందరు చెబుతున్నారు.