విద్యామంత్రికి అంకితం.. అలా సంబరాలు ఎందుకంటే?: రవీంద్ర జడేజా
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలిసారి రవీంద్ర జడేజా సూపర్ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇటు బ్యాటింగ్‌లో 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడే టాప్ స్కోరర్. ఇటు బౌలింగ్‌లోనూ నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఒక్క వికెట్ తీసి కేవలం 29 పరుగులే ఇచ్చాడు. ఆ వికెట్ కూడా ప్రమాదకరమైన నికోలస్ పూరన్‌ది కావడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఓ స్పెషల్ వ్యక్తికి అంకితం చేస్తున్నట్లు జడేజా వెల్లడించాడు. ఇక పూరన్‌ను ఔట్ చేసిన తర్వాత చేసుకున్న ‘పాకెట్’ సంబరాల పైనా జడ్డూ స్పందించాడు.
‘‘రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం బాగుంది. మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఈ అవార్డును గుజరాత్ ఎడ్యుకేషన్ మినిస్టర్, నా భార్య రివాబా జడేజాకు అంకితం చేస్తున్నా. ఈ మ్యాచ్‌లో నేను అద్భుతాలు చేస్తానని ఆమె చెప్పింది. ఈ సందర్భంగా తనకు ధన్యవాదాలు చెబుతున్నా. ఇక ఈ మ్యాచ్‌లో పిచ్ చాలా కఠినంగా ఉంది. ఇక్కడ బ్యాటింగ్ చేయడం కష్టంగా అనిపించింది. ప్రతి బంతీ వేగంగా, స్వింగ్‌తో వస్తోంది. అందుకే, క్రీజ్‌లో కుదురుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చా. డొనావన్ ఫెర్రీరాతోనూ ఇదే చెప్పా. ఇది టీ20. ఏదైనా జరగొచ్చు. మేం చివరి ఓవర్‌లో 20 పరుగులు రాబట్టగలిగాం. మయాంక్‌ను టార్గెట్ చేయడంపై ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. నా బలమేంటో తెలుసు. నా పార్టనర్‌తోనూ మాట్లాడుతూనే ఉన్నా. ఈ పిచ్‌పై షాట్లు కొట్టడం అంత తేలికేం కాదు. సీమ్‌తోపాటు బౌన్స్ అవుతుండటం బ్యాటర్లకు కష్టంగా మారింది’’ అని జడేజా తెలిపాడు.
‘‘అవును నికోలస్ పూరన్ నా జేబులో ఉన్నాడు (నవ్వుతూ). కావాలని చేసిందేమీ కాదు. యాదృశ్చికంగా అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన అది. బంతి బాగా గ్రిప్ అవుతోంది. దీంతో వేగంగా వేయాలా? స్లో బంతులు వేయాలా? అని కాస్త ఆలోచించా. స్లో బంతులు వేయడానికే మొగ్గు చూపా. మిచెల్ మార్ష్‌కు, నికోలస్ పూరన్‌కు భిన్నమైన బౌలింగ్ చేశా. మిడ్ వికెట్, లాంగాన్ వైపు బౌండరీ లైన్ కాస్త చిన్నగా ఉంది. తప్పకుండా పూరన్ భారీ షాట్లు కొడతాడని తెలుసు. దీంతో పేస్, స్లో, స్పిన్‌ను మిక్స్ చేసి బౌలింగ్ చేశా’’ అని జడేజా వెల్లడించాడు. రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో 17వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రాజస్థాన్ తరఫున ఇదే తొలిసారి కావడం గమనార్హం. సీఎస్‌కే తరఫున 186 మ్యాచుల్లో 16 potmలను గెలుచుకున్నాడు. రోహిత్ శర్మ (21), విరాట్ కోహ్లీ (19), ధోని (18) తర్వాత జడేజా ఉన్నాడు.