నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా?
అధికారం అయితే నీది లేదంటే నాది.. ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా నడిచే తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు ఇదే . అయితే ఈసారి విజయ్ అనే రూపంలో ‘మార్పు’ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బ కొట్టింది. వాటిని పక్కన నెట్టేసి అధికారం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వైరాన్ని పక్కన పెట్టి డీఎంకే–అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయా?..
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్య చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండూ కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నాయి. తద్వారా అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్‌కు భారీ షాక్ తగలబోతోంది. అదే టైంలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన తమను ఇంతకాలం అవసరానికి వాడుకున్న జాతీయ పార్టీలనూ దెబ్బ కొట్టబోతున్నాయి. ఇది నిన్న సాయంత్రం నుంచి తమిళనాట జరుగుతున్న ప్రచారం. అయితే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే రెండూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్‌గేమ్ అని తిట్టిపోశాయి.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాట ఒకటి ఉంది. అలాంటప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే.. ఈ పార్టీల మధ్య స్నేహం ఎందుకు అసాధ్యం?. తమిళ రాజకీయాల పేజీలను తిరగేస్తే.. ఏనాడూ ఈ పార్టీలు జట్టు కట్టిన సందర్భం కనిపించదు. స్థానిక ఎన్నికల దగ్గరి నుంచి ఎందులో అయినా సరే మద్దతు అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కేవలం ద్రవిడ ఉద్యమ వారసత్వం, తమిళ భాషా హక్కుల అంశాల్లో రెండు పార్టీలూ ఒకే వేదికను పంచుకోవడం తప్పించి.
1972లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ (MGR) బహిష్కరించింది. ఆ అవమానానికి ప్రతీకారంగా ఎంజీఆర్ అన్నాడీఎంకే (AIADMK) స్థాపించారు. కొత్త పార్టీ ప్రకటన సమయంలో.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారాయన. నాటి నుంచి నేటి దాకా.. ఒక పార్టీ ఉనికి మరొక పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ రెండూ కలిస్తే, అవి తమ మౌలిక సిద్ధాంతాన్ని తామే తుడిచేసుకున్నట్లు అవుతుంది.