Select Location
All Locations
State
Region
City / District
స్పేస్‌ఎక్స్‌తో ఆంత్రోపిక్ మెగా డీల్!

స్పేస్‌ఎక్స్‌తో ఆంత్రోపిక్ మెగా డీల్!

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్, ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్‌తో భారీ డేటా సెంటర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమ క్లాడ్ ఏఐ సేవలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి అవసరమైన కంప్యూటింగ్ శక్తిని పొందే లక్ష్యంతో ఆంత్రోపిక్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం, టెన్నెసీలోని మెంఫిస్‌లో ఉన్న స్పేస్‌ఎక్స్ ‘కొలోసస్ 1’ డేటా సెంటర్ పూర్తి కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఇకపై ఆంత్రోపిక్ వినియోగించుకోనుంది. వాస్తవానికి ఈ కేంద్రాన్ని మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్‌ఏఐ కోసం నిర్మించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఇది ఆంత్రోపిక్ చేతుల్లోకి వెళ్తోంది. ఇది 2,20,000 ఎన్విడియా ఏఐ చిప్‌ల మద్దతుతో, దాదాపు 300 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఈ డేటా సెంటర్‌ వల్ల క్లాడ్ ప్రో, క్లాడ్ మాక్స్ చందాదారులకు వేగవంతమైన సేవలు అందనున్నాయి. సాఫ్ట్‌వేర్ రాయడం, ఎడిటింగ్, డీబగ్గింగ్ చేయగల క్లాడ్ కోడ్ పరిమితులను కంపెనీ రెట్టింపు చేసింది. ఇకపై బిజీ సమయాల్లోనూ ఎటువంటి అంతరాయం లేకుండా యూజర్లు దీనిని వాడుకోవచ్చు.

ఈ ఒప్పందం టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోదీపై, ఆ సంస్థ సిద్ధాంతాలపై మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంత్రోపిక్ సంస్థ పాశ్చాత్య నాగరికతను ద్వేషిస్తుందని, అది ఒక కపట సంస్థ అని గత ఫిబ్రవరిలో మస్క్ ఎక్స్ వేదికగా దుమ్మెత్తిపోశారు. అయితే, తాజాగా చేసిన మస్క్ పోస్ట్ భిన్నంగా ఉంది. ‘గత వారం ఆంత్రోపిక్ సీఈఓ, తమ సిబ్బందితో సమయం గడిపాను. వారి సామర్థ్యం చూసి ముచ్చటేసింది. వారు సరైన పని చేయడంపై చాలా శ్రద్ధ వహిస్తున్నారు’ అని ప్రశంసించారు. మరో కీలక ప్రకటన చేస్తూ, ఎక్స్‌ఏఐని స్వతంత్ర సంస్థగా రద్దు చేస్తున్నానని ఇకపై అది స్పేస్‌ఎక్స్ ఏఐగా మాత్రమే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ ఒప్పందంలో భాగమైన మెంఫిస్ డేటా సెంటర్ ప్రస్తుతం వివాదాల్లో ఉంది. భారీ స్థాయిలో సహజ వాయువును మండించే టర్బైన్లను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని పౌర హక్కుల సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఫెడరల్ అనుమతులు లేకుండానే వీటిని నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


Sakshi 49 minutes ago
Home Flash News