ఆదాయపుపన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిందా..? టెన్షన్ పడకుండా ఇలా చేయండి
టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం ఇప్పుడు క్లిక్‌తో పూర్తయ్యేంత సులభమైపోయింది. ప్రక్రియ ఎంత ఈజీ అయినా.. చాలామంది పన్ను చెల్లింపుదారులకు అప్పుడప్పుడు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తుంటాయి. ఇన్కమ్ టాక్స్ నోటీసు అనగానే చాలామంది హడలిపోతుంటారు. భయపడటం వల్ల సమస్య పరిష్కారం కాదు. అవగాహన ఉండాలి. అసలు ఈ నోటీసులు ఎందుకు వస్తాయి? అవి నిజమైనవో కాదో ఎలా తెలుసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు వచ్చే అధికారిక సమాచారాన్నే నోటీసు అని అంటారు. ఇది సాధారణంగా మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా ఐటీ పోర్టల్‌లోని అకౌంట్‌కు వస్తుంది. నోటీసు వచ్చిందంటే మీరు తప్పు చేశారని అర్థం కాదు. రిటర్న్స్‌లో ఏవైనా చిన్నపాటి తప్పులు ఉన్నా, అదనపు సమాచారం కావాలన్నా, సాధారణ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా కూడా అధికారులు నోటీసులు పంపిస్తుంటారు.
నోటీసు అసలైనదా? నకిలీదా? ఈ రోజుల్లో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. అందుకే అసలు వచ్చిన నోటీసు నిజమైనదో కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ఇన్కమ్ టాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు. పోర్టల్‌లో అథెంటికేట్ నోటీస్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ వివరాలు నమోదు చేసి నిమిషాల్లో అది అసలైనదో కాదో తెలుసుకోవచ్చు. వెరిఫికేషన్ ప్రక్రియ.. మొదట ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి. అక్కడ 'Quick Links' విభాగంలో 'Authenticate Notice'పై క్లిక్ చేయండి. మీకు వచ్చిన నోటీసుపై ఉండే డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్.. మీ మొబైల్ నంబర్ నమోదు చేయాలి. పాన్ కార్డ్ నంబర్, అసెస్‌మెంట్ ఇయర్ వివరాలతో కూడా చెక్ చేయవచ్చు.
మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే.. ఆ నోటీసు అధికారికంగా జారీ అయిందో లేదో స్క్రీన్‌పై కనిపిస్తుంది. నోటీసులు రావడానికి ప్రధాన కారణాలు.. రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం లేదా తప్పుడు ఫారమ్‌ను ఎంచుకోవడం ప్రధాన కారణం కావచ్చు. టీడీఎస్ లెక్కల్లో తేడాలు ఉన్నా.. ఆదాయ వివరాలను తప్పుగా ఇచ్చినా నోటీసు వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. భారీ ట్రాన్సాక్షన్ చేసి వాటిని రిటర్న్స్‌లో చూపకపోయినా ఐటీ శాఖ వివరణ కోరుతుంది. కాబట్టి నోటీసు రాగానే ఆందోళన చెందకుండా, అది ఏ సెక్షన్ కింద వచ్చిందో చూసుకుని సరైన సమయంలో స్పందించడం బెటర్. అవసరమైతే మీ సీఏని సంప్రదించటం దీనిపై క్లారిటీ ఇస్తుంది.