దళపతి ధాటికి 100 మంది లాయర్ల రాజీనామా.. హీటెక్కిన తమిళ పాలిటిక్స్
తమిళనాడు రాజకీయ రణరంగంలో ఎవరూ ఊహించని ఉత్కంఠ నెలకొంది. దళపతి విజయ్ నేతృత్వంలోని TVK అధికార పీఠానికి అడుగు దూరంలో నిలిచిపోవడంతో.. అటు ప్రభుత్వం, ఇటు న్యాయవ్యవస్థలో అనూహ్య మార్పులు మొదలయ్యాయి. దీంతో ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం తరఫున కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్న 100 మందికి పైగా లా ఆఫీసర్లు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. అడ్వకేట్ జనరల్ పి.ఎస్. రామన్ నేతృత్వంలోని ఈ టీమ్.. ప్రభుత్వం మారబోతున్న తరుణంలో నైతిక బాధ్యతగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
సాధారణంగా ప్రభుత్వం మారినప్పుడు పాత ప్రభుత్వం నియమించిన లీగల్ టీమ్ తప్పుకోవడం ఆనవాయితీ. అయితే ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. విజయ్ పార్టీకి ఇంకా పూర్తి మెజారిటీ రాకపోవడం, కాంగ్రెస్ మద్దతుతో 113 వద్దే ఆగిపోవడంతో కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరుతుందో స్పష్టత లేదు. దీంతో కోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించేవారు లేకపోతే ఇబ్బంది కలుగుతుందని భావించి, కొత్త టీమ్ వచ్చే వరకు మరో వారం రోజులు పదవుల్లో కొనసాగాలని గవర్నర్ కార్యాలయం వీరిని కోరింది. రాజకీయ నియామకాలే అయినప్పటికీ.. రాజ్యాంగపరమైన సంక్షోభం రాకూడదనే ఉద్దేశంతో ఈ తాత్కాలిక ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విజయ్‌కు స్పష్టమైన సంకేతాలిచ్చారు. 24 గంటల్లో రెండుసార్లు భేటీ అయినప్పటికీ, సంఖ్యా బలాన్ని నిరూపించుకుంటేనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తానని తెగేసి చెప్పారు. అటు సీపీఎం, సీపీఐ, వీసీకే వంటి పార్టీలు ఇంకా విజయ్ వైపు మొగ్గు చూపకపోవడం ఉత్కంఠను పెంచుతోంది. ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి తమను అడ్డుకోవాలని చూస్తే, తమ పార్టీకి చెందిన 108 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని విజయ్ హెచ్చరించారు. మొత్తానికి లాయర్ల రాజీనామాల నుంచి ఎమ్మెల్యేల హెచ్చరికల దాకా.. తమిళ పాలిటిక్స్ ఇప్పుడు ఒక హై-వోల్టేజ్ క్లైమాక్స్ సీన్‌ను తలపిస్తున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఈ పరిణామాలను గమనిస్తు్న్నారు.