రాష్ట్ర అభివృద్ధి కోసం.. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అభివృద్ది కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం.. నియోజకవర్గ ప్రజల కలలను సాకారం చేస్తానని చెప్పారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతోనే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానన్న రేవంత్.. ఈ ప్రాంతానికి పేదల తిరుపతి'గా పేరుందని, మూడు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే ఈ ఆలయాన్ని దేశస్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సుందరవర్ణాచార్యుల గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా ఆలయ అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు.
రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గత పాలకులు కొడంగల్‌ను ఏమాత్రం పట్టించుకోలేదని.. కనీసం రోడ్లు, మంచినీళ్లు, స్కూళ్లు కూడా లేని పరిస్థితి నుంచి నేడు కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతోందని గుర్తు చేశారు. ఒకప్పుడు చదువుల కోసం పక్క ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఇతర ప్రాంతాల వారు కొడంగల్‌కు వచ్చి చదువుకునే స్థాయికి అభివృద్ధి చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
రైతులకు మేలు చేసేలా కృష్ణా జలాలు కొడంగల్ భూములను ముద్దాడతాయని సీఎం భరోసా ఇచ్చారు. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని.. నిధుల కొరత అస్సలే లేదని ప్రకటించారు. వికారాబాద్-కృష్ణా రైల్వే పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని కీలక ప్రకటన చేశారు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాను.. పేదల సంక్షేమమే నా లక్ష్యం అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరినీ కోరుతూ.. రాబోయే రోజుల్లో నియోజకవర్గ రూపురేఖలు మార్చేస్తానని మాట ఇచ్చారు.