Select Location
All Locations
State
Region
City / District
వెలుగు ఓపెన్ పేజీ.. ఇండో-మధ్యధరా ప్రాంతం కోసం.. భారత్‌‌‌‌‌‌‌‌ -ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం

వెలుగు ఓపెన్ పేజీ.. ఇండో-మధ్యధరా ప్రాంతం కోసం.. భారత్‌‌‌‌‌‌‌‌ -ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్‌‌‌‌‌‌‌‌, ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు నేడొక కీలక మలుపులో నిలిచాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై సంయుక్త ఆశావహ దృక్పథం ప్రాతిపదికన ఇటీవలి కాలంలో అసాధారణ వేగంతో విస్తరిస్తూ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవస్థ ప్రగాఢ మార్పులకు లోనవుతున్న తరుణంలో అత్యున్నత రాజకీయ, సంస్థాగత స్థాయులలో క్రమబద్ధ ఆదాన ప్రదానాలు రెండు దేశాల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తున్నాయి.

అనాదిగా సంక్రమిస్తున్న నాగరికతా జ్ఞానం మేళవింపుతో మా ఆర్థిక చైతన్యం, సామాజిక సృజనాత్మకత ఈ పరిణామానికి కొత్త కోణాన్ని ఆపాదిస్తున్నాయి. ప్రస్తుత 21వ శతాబ్దంలో ఆయా దేశాల ఆవిష్కరణ సామర్థ్యం, ఇంధన మార్పిడి నిర్వహణ, వ్యూహాత్మక సార్వభౌమత్వ బలోపేతం తదితరాలు ప్రజా శ్రేయస్సు, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ విషయంలో మా ఉమ్మడి అవగాహనను రెండు దేశాల మధ్య సహకారం ప్రస్ఫుటం చేస్తోంది. ఈ దిశగా కొత్త సంకల్పాల సాకారానికి, పరస్పర పూరక బలాల ఏకీకరణ సహా ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్ఠంగా, వైవిధ్యభరితంగా తీర్చిదిద్దడంపై మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ఇటలీ డిజైన్, తయారీ నైపుణ్యం, అంతర్జాతీయ స్థాయి సూపర్ కంప్యూటర్లతో పారిశ్రామిక కూడలిగా ప్రపంచంలో ఇటలీకి ప్రముఖ స్థానం ఉంది. అదేవిధంగా 100కు పైగా యూనికార్న్‌‌‌‌‌‌‌‌ సంస్థలు సహా 2,00,000 అంకుర సంస్థలతో భారత్‌‌‌‌‌‌‌‌ శరవేగంగా ఆర్థిక వృద్ధిని సాధిస్తోంది. 

దీంతోపాటు ఇంజినీరింగ్ ప్రతిభ- విస్తృతి, ఆవిష్కరణ- వ్యవస్థాపనావరణ వ్యవస్థలను కలిగి ఉంది. రెండు దేశాలకుగల ఈ సామర్థ్యాల మధ్య శక్తిమంతమైన సమన్వయ సాధన లక్ష్యాన్ని మేం నిర్దేశించుకున్నాం. ఇది ఓ సాధారణ ఏకీకరణకు పరిమితం కాదు. మా పారిశ్రామిక బలాలను పరస్పరం బలోపేతం చేసుకునే విలువ వ్యవస్థను సంయుక్తంగా సృష్టిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు ఇనుమడించేందుకు ఐరోపా సమాఖ్య- భారత్‌‌‌‌‌‌‌‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఏ) బాటలు వేస్తుంది. రక్షణ- ఏరోస్పేస్, కాలుష్య రహిత సాంకేతికతలు, యంత్రాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, రసాయన -ఔషధ, జౌళి, వ్యవసాయ- ఆహార, పర్యాటకం సహా మరిన్ని రంగాలపై ‘ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఏ’ దృష్టి సారిస్తుంది. తద్వారా 2029 నాటికి ఇటలీ, -భారత్‌‌‌‌‌‌‌‌ మధ్య నిర్దేశిత 20 బిలియన్ యూరోల వాణిజ్య లక్ష్యాన్ని చేరడంతో సరిపెట్టకుండా దాన్ని అధిగమించాలన్నది మా ఆకాంక్ష. ఉన్నత నాణ్యత లక్ష్యంతో ‘మేక్ ఇన్ ఇండియా’ ‘మేడ్ ఇన్ ఇటలీ’ అనేది అంతర్జాతీయంగా అత్యుత్తమ నాణ్యతకు పర్యాయ పదబంధం. 

ఇప్పుడిది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ నిర్దేశిత ఉన్నత నాణ్యత లక్ష్యంతో సహజ సమన్వయం ఏర్పరుచుకుంటుంది. ఈ నేపథ్యంలో భారత్‌‌‌‌‌‌‌‌ కోసం ఉత్పాదన దిశగా ఇటలీ వ్యాపార సంస్థలలో ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు ఇటలీలో భారత పరిశ్రమల సంఖ్య కూడా పెరగడం (ప్రస్తుతం రెండువైపులా వీటి సంఖ్య 1000కి పైగానే) మా సరఫరా వ్యవస్థల ఏకీకరణను బలోపేతం చేసే సానుకూల సంకేతం. మా భాగస్వామ్యానికి సాంకేతిక ఆవిష్కరణలే పునాది. కృత్రిమ మేధ, (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, అత్యాధునిక తయారీ, కీలక ఖనిజాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో నేటి పురోగమన వేగం రాబోయే దశాబ్దాల్లో అసాధారణ పరిధిగల సాంకేతిక విప్లవంగా రూపుదిద్దుకోగలదు. ఈ క్రమంలో చైతన్యవంతమైన భారత ఆవిష్కరణావరణ వ్యవస్థ, అత్యంత నైపుణ్యంగల వృత్తి నిపుణుల వనరులు, ఇటలీకిగల అత్యధునాతన పారిశ్రామిక సామర్థ్యం మేళవింపుతో పైన పేర్కొన్న రంగాలన్నిటా మా సహకారం సహజ సిద్ధమైనదిగా, వ్యూహాత్మకంగా రూపొందుతోంది. రెండు దేశాల్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం ఈ పరిణామశీలతకు ఇతోధికంగా తోడ్పడుతుంది. ఇక భారత సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఇప్పటికే అనేక దేశాల్లో... ముఖ్యంగా వర్ధమాన ఆర్థిక వ్యవస్థలలో సానుకూల స్పందన లభిస్తోంది.


V6 News 15 minutes ago
Home Flash News