Select Location
All Locations
State
Region
City / District
మూడో యుద్ధానికి ట్రంప్‌ సిద్ధమా.. ఇరాన్‌ తర్వాత టార్గెట్‌ క్యూబానేనా..!

మూడో యుద్ధానికి ట్రంప్‌ సిద్ధమా.. ఇరాన్‌ తర్వాత టార్గెట్‌ క్యూబానేనా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌తో యుద్ధంలో దెబ్బతిన్న అమెరికా (USA) ఇప్పుడు క్యూబాను సైనికపరంగా లొంగదీసుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వ్యాఖ్యలు, చర్యలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. కరేబియన్‌లోకి అమెరికా విమానవాహక నౌక.. కరేబియన్‌ సముద్రంలోకి అమెరికా తన అత్యంత కీలకమైన యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌ విమాన వాహక నౌకను పంపింది. దీనిపైనుంచి ఎఫ్‌-18 స్ట్రైక్‌ ఈగిల్‌, ఈఏ-18జీ గ్రావ్‌లర్లు, సీ-2ఏ గ్రేహౌండ్స్‌ విమానాలను నడపవచ్చు. దీంతోపాటు భారీగా క్యారియర్‌ స్ట్రైక్‌గ్రూప్‌లోని యూఎస్‌ఎస్‌ గ్రిడ్లీ డెస్ట్రాయర్‌, యూఎస్‌ఎస్‌ పటక్సెంట్‌ నౌకతోపాటు ఇతర సాధన సంపత్తిని తరలించింది.

ఇటీవలే యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌, బ్రెజిల్‌తో కలిసి యుద్ధవిన్యాసాలు కూడా నిర్వహించింది. గతంలో వెనెజువెలా, ఇరాన్‌పై దాడుల సమయంలో కూడా చాలా ముందుగానే అమెరికా తన విమాన వాహక నౌకలను ఆయా ప్రాంతాల్లోని సముద్ర జలాల్లో మోహరించిన విషయం తెలిసిందే. అలాగే క్యూబాపై సీఐఏతో ఆపరేషన్‌ చేయించి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం కూడా ఉంది. సాయుధ డ్రోన్లతో సిద్ధంగా క్యూబా.. క్యూబా కూడా అమెరికా దాడి చేయవచ్చనే అంచనాకు వచ్చింది. దీంతో ఇటీవలే దాని సైన్యం దాదాపు 300 సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసింది. వీటితో అమెరికాలోని గ్వాంటనామోబేపై దాడి చేసేలా ప్లాన్‌ను రచించినట్లు అమెరికా పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఇది ఉత్తర హవానాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉంది. ఇప్పటికే డ్రోన్‌ యుద్ధతంత్రంతో ఇరాన్‌ చేతిలో దెబ్బతిని పరువు కోల్పోయిన ట్రంప్‌ సర్కారుకు.. ఇప్పుడు క్యూబా డ్రోన్లు కంటగింపుగా మారినట్లు తెలుస్తోంది. పాత ఘటనలు తవ్వి క్యూబా నేతపై అమెరికాలో నేరాభియోగాలు.. క్యూబా కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేత 94 ఏళ్ల రౌల్‌ క్యాస్ట్రోపై అమెరికాలో నేరాభియోగాలను జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ నమోదు చేసింది. 

1996లో రెండు పౌర విమానాల కూల్చివేత ఘటనలకు సంబంధించి వీటిని నమోదు చేశారు. ఈ ఘటనల్లో నలుగురు చనిపోగా.. వారిలో ముగ్గురు అమెరికన్లు. అంతర్జాతీయ గగనతలంలో రెండు క్యూబా మిగ్‌ ఫైటర్లు ఈ దాడులు చేసినట్లు ఆరోపణలున్నాయి. 1931లో తన సోదరుడు ఫిడెల్‌ క్యాస్ట్రోతో కలిసి రౌల్‌ క్యాస్ట్రో గెరిల్లా యుద్ధం చేసి అమెరికా కీలుబొమ్మగా ఉన్న నాటి క్యూబా నియంత ఫ్లుజెన్సియో బటిస్టా సామ్రాజ్యాన్ని కూల్చాడు. దీంతోపాటు 1961లో క్యూబాను ఆక్రమించేందుకు అమెరికా చేపట్టిన ‘బేఆఫ్‌ పిగ్స్‌’ ఆపరేషన్‌ విఫలం చేసింది కూడా రౌల్‌ క్యాస్ట్రోనే. క్యూబా రక్షణమంత్రిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. మరోవైపు అమెరికా చేసిన అభియోగాలను క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్-కానెల్ బెర్ముడెజ్ తిప్పికొట్టారు. క్యూబా తలవంచకపోవడంతో అమెరికాలో అసహనం పెరిగిపోయిందన్నారు. క్యూబాకు స్వేచ్ఛనిస్తామంటూ ట్రంప్‌ బెదిరింపులు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘మావాళ్లు చాలామంది క్యూబాలో ఉన్నారు. మా సీఐఏ అక్కడ చురుగ్గా ఉంది. మా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబాకు చెందినవారు. మా వద్ద చాలామంది నిపుణులు ఉన్నారు. మేము క్యూబా ప్రజలకు సాయం చేయనున్నాం. క్యూబాకు స్వేచ్ఛను ప్రసాదించనున్నాం’’ అని పేర్కొన్న వీడియోను అమెరికా విదేశాంగశాఖ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.


Eenadu Telugu 43 minutes ago
Home Flash News