200 స్థానాల్లో పోటీకి ఎంఐఎం వ్యూహం.. బీఎస్పీతో పొత్తుకు ఓవైసీ ఆసక్తి!
ఉత్తరప్రదేశ్ (UP) అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే రాజకీయ వేడి మొదలైంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్నికల సమరానికి ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. బహ్రైచ్ జిల్లాను వేదికగా చేసుకుని ఆయన ఈ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. ఈసారి ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని మజ్లిస్ పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది.
యూపీలో పెద్ద ఎత్తున ఎన్నికల బరిలోకి దిగేందుకు ఏఐఎంఐఎం శ్రేణులు సిద్ధమవుతున్నప్పటికీ.. పొత్తుల విషయంలో మాత్రం పార్టీ సానుకూలంగా ఉందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ముఖ్యంగా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP)తో పొత్తు పెట్టుకునేందుకు ఒవైసీ ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ ఎన్నికల నాటికి ఈ పొత్తు గనుక కుదిరితే.. పోటీ చేసే స్థానాల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో దళిత-ముస్లిం సామాజిక వర్గాల కలయిక జరిగితే, అది ఇటు అధికార బీజేపీకి, అటు ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (SP)కి గట్టి పోటీని ఇస్తుందని మజ్లిస్ భావిస్తోంది.