Andhra news: రాష్ట్ర పండుగగా జగ్గన్నతోట ప్రభల తీర్థం.. ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
అంబాజీపేట: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన ప్రభల తీర్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రభల తీర్థం ఘనంగా నిర్వహిస్తారు. అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల తీర్థం ప్రాచీన సంప్రదాయం. 476 ఏళ్లుగా ఈ తీర్థాన్ని ఏటా సంక్రాంతి పండుగలో కనుమ రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాలు చూసేందుకు ఐదారు లక్షల మంది హాజరవుతారని అంచనా. ఏకాదశ రుద్రులు 11 గ్రామాల నుంచి బయలుదేరి జగ్గన్నతోటలో ఆ రోజు కొలువుదీరతారని, వారు అక్కడ ప్రజాక్షేమం కోసం చర్చించుకుంటారనేది కోనసీమ వాసుల నమ్మకం. ఈ ఏడాది జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది.