లెబనాన్‌పై దాడులు ఆపితేనే.. స్తంభింపజేసిన మా ఆస్తులను వెంటనే విడుదల చేయాలి
న్యూఢిల్లీ : తమ షరతులను నెరవేర్చే వరకు చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఖర్ ఘలీబాఫ్ శుక్రవారం స్పష్టం చేశారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ, స్తంభింపచేసిన తమ ఆస్తుల విడుదల ముందుగా జరగాలని ఆయన తెలిపారు. ముందుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చర్చలు ముందుకు కదలవని ఆయన స్పష్టం చేశారు. పక్షాల మధ్య పరస్పరం అంగీకారం కుదిరిన రెండు చర్యలు ఇంకా అమలు కాలేదు. అవి లెబనాన్‌లో కాల్పుల విరమణ, చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్‌కు చెందిన స్తంభింపచేసిన ఆస్తులను విడుదల చేయడం అని ఆయన పేర్కొన్నారు. చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఈ రెండు డిమాండ్లను అమలు చేయాలని ఆయన చెప్పారు.
లెబనాన్‌పై ఇజ్రాయెలీ దాడులను నిలువరించి కాల్పుల విరమణలో లెబనాన్ కూడా భాగమేనని ఒప్పుకుంటూ తాను ఇచ్చిన హామీలకు అమెరికా కట్టుబడి ఉండాలని ఇరాన్ మంత్రి అరాగ్చీ స్పష్టం చేశారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే విస్తృత కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మధ్యవర్తిగా పాక్ జోక్యాన్ని ఇజ్రాయెల్ కూడా గట్టిగా ప్రతిఘటించింది. ముఖ్యంగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇటీవ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌ను ఓ దుష్టశక్తిగా, మానవాళికి శాపంగా అభివర్ణిస్తూ ఆసిఫ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ దేశంగా పేర్కొన్నారు. దీనిపై విమర్శలు రావడంతో ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశారు. ఆసిఫ్ వ్యాఖ్యలను ఖండించిన ఇజ్రాయెలీ అధికారులు సున్నితమైన చర్చలను నిర్వహించడంలో పాకిస్థాన్ నిష్పాక్షికతను ప్రశ్నించారు.