Select Location
All Locations
State
Region
City / District
పాక్‌ నోరు మూయించి.. ప్రపంచానికి మన తలుపులు తెరచి..

పాక్‌ నోరు మూయించి.. ప్రపంచానికి మన తలుపులు తెరచి..

పహల్గాం ఊచకోతకు ప్రతీకారంగా ముష్కర మూకలపై ఆ రాత్రి ప్రతిధ్వనించింది ఆయుధాలు మాత్రమే కాదు... ప్రస్ఫుటించింది గతంలో కననీ, విననీ నయా రణనీతి. ఉలిక్కిపడింది ఉగ్రమూకలే కాదు... ఉక్కిరిబిక్కిరైంది పొరుగుదేశం దుర్నీతి.మన దౌత్యశక్తి పాక్‌ నోట మాట పెగలకుండా చేసింది. అంతేనా... ఈ రణం మన ఆయుధశక్తిని ప్రపంచానికి చాటి... వ్యాపారవ్యాప్తికీ కారణమైంది.... మొత్తంగా 88 గంటల ఈ ఆపరేషన్‌ భారతావని నొసటన విజయ సిందూరాన్ని దిద్ది నేటికి ఏడాది! ‘2025, మే 6 అర్ధరాత్రి దాటాక.’.. శత్రుదేశానికి వెన్నులో వణుకు తెప్పించిన తేదీ, సమయం ఇది. యావత్‌ భారతావని సగర్వంతో ఉప్పొంగిన రోజు ఇది. ఈ రోజునే పాకిస్థాన్‌పై భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో విరుచుకుపడింది. కశ్మీర్‌లోని పహల్గాంలో అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు, వారి తండాలను క్షిపణులతో తుదముట్టించింది. 

ఈ దాడితో భారత సైనిక సామర్థ్యం ఏంటో ప్రపంచానికి చాటిచెప్పడం మాత్రమే కాదు.. దేశ భద్రత విషయంలో మన నియమాలను పునర్‌ నిర్వచించుకున్నామని, పరిమితులు, హద్దులు మార్చుకున్నామని శత్రువుకు గట్టి సందేశమిచ్చినట్లయింది..! గురిచూసి గుండెను కొట్టి... 2025 ఏప్రిల్‌ 22న పహల్గాంలోని పర్యాటక ప్రాంతంపై విరుచుకుపడిన పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకోవడంతో యావత్‌ దేశం దిగ్భ్రాంతికి గురైంది. వారికి బుద్ధిచెప్పాలని తీర్మానించుకున్న భారత్‌- మే 6వ తేదీ అర్ధరాత్రి దాటాక అదను చూసి దాయాదిపై నిప్పులు కురిపించింది. ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపింది. జైషే మహ్మద్, లష్కరే తయ్యిబాకు చెందిన కీలక స్థావరాలను మట్టికరిపించింది. యూసుఫ్‌ అజహర్, అబ్దుల్‌ మాలిక్‌ రవూఫ్, ముదసర్‌ అహ్మద్‌ సహా దాదాపు 100 మంది తీవ్రవాదులు హతమయ్యారు. భారత్‌ ప్రయోగించిన ఆయుధాలు పాకిస్థాన్, పీఓకే లోపలికి చొచ్చుకెళ్లి..

దాదాపు 9 తీవ్రవాద తయారీ కేంద్రాలను, వాటి మౌలిక సదుపాయాలను ధ్వంసంచేశాయి. లాంచ్‌ ప్యాడ్లను నేలమట్టం చేశాయి. సియాల్‌కోట్‌ నుంచి బహావల్‌పుర్‌ దాకా ఎక్కడా గురితప్పకుండా అనుకున్న లక్ష్యాల్ని ఛేదించాయి. నూర్‌ఖాన్‌ బేస్, సర్గోధా ఎయిర్‌బేస్‌లాంటి పాకిస్థాన్‌ కీలక సైనిక కేంద్రాలు ధ్వంసమయ్యాయి. సింగిల్‌ ఆపరేషన్‌లో 11 పాకిస్థానీ ఎయిర్‌బేస్‌లను భారత్‌ ధ్వంసంచేసింది. కేవలం 23 నిముషాల వ్యవధిలోనే భారత్‌ తన మిషన్‌ను పూర్తిచేసింది. ఊహించని ఈ ఆపరేషన్‌తో పాకిస్థాన్‌ ఉలిక్కిపడింది. ఆ తర్వాత ప్రతిదాడులకు పాల్పడింది. వాటిని మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. మొత్తంగా ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదంపై పోరాటం విషయంలో భారత్‌ తమ హద్దులను పునర్‌నిర్వచించుకున్నట్లయ్యింది. చివరకు పాకిస్థాన్‌ దిగివచ్చి యుద్ధ విరమణకు బతిమాలుకుంది. దీంతో మే 10 సాయంత్రం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఆగింది.


Eenadu Telugu 53 minutes ago
Home Flash News