సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అదనపు పనివేళలు..ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 వరకు ఓపెన్: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెలఖరులో భూముల విలువల సవరణ ఉండడంతో రిజిస్ట్రేషన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిం ది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీ నుంచి 15వరకు ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అదనపు పనివేళలు అమలు చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సాధారణంగా ఉండే పనివేళలకు భిన్నంగా ఉదయం 9.30 నుంచే సేవలు ప్రారంభించి సాయంత్రం 6.30 గంటల వరకు ఆఫీసులను తెరిచి ఉంచాలని సూచించారు. రిజిస్ట్రేషన్ల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను పెంచాలన్నారు. నగరంతో పాటు శివారు ప్రాంతాలైన చంపాపేట్, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట్, మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్‌కేసర్, నల్గొండ ఆర్.ఓ, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ ఆఫీసుల్లో ఈ ప్రత్యేక పని వేళలు వర్తిస్తాయని మంత్రి తెలిపారు.
ఒకవేళ రద్దీ ఇంకా పెరిగితే పని వేళలను మరింత పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకంగా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూముల ధరల సవరణ అమల్లోకి రాకముందే తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలనుకునే సామాన్యులకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.