Select Location
All Locations
State
Region
City / District
బీసీల లెక్కలు కేంద్రానికి తెలియాల్సిందే: సుప్రీంకోర్టు

బీసీల లెక్కలు కేంద్రానికి తెలియాల్సిందే: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: జన గణనలో కుల గణన నిర్వహించాలా.. వద్దా.. అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎంత మంది వెనుకబడిన తరగతుల (బీసీ) ప్రజలు ఉన్నారో తెలిస్తేనే.. వారి కోసం ఎలాంటి సంక్షేమ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించుకోగలదని పేర్కొంది. ఈ మేరకు జన గణనలో కుల గణన చేపట్టవద్దని కోరుతూ దాఖలైన పిల్‌‌ను ధర్మాసనం కొట్టివేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న జన గణనలో కులగణన చేపట్టవద్దని గతేడాది సెప్టెంబర్‌‌‌‌లో సుధాకర్ గుమ్ముల సుప్రీంకోర్టులో పిల్‌‌ దాఖలు చేశారు. ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిల ధర్మాసనం విచారణ జరిపింది. అయితే... స్వయంగా వాదనలు వినిపించేందుకు పిటిషనర్ అభ్యర్థించగా ధర్మాసనం అనుమతించింది.

కులాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వద్ద కావాల్సినంత సమాచారం ఉందని, అందువల్ల కొత్తగా కుల గణన చేయాల్సిన అవసరం లేదని పిటిషనర్‌‌‌‌ సుధాకర్ గుమ్ముల అన్నారు. ప్రభుత్వ సేకరణ తర్వాత ఈ డేటా కార్పొరేట్ కంపెనీలు, పొలిటికల్ లీడర్ల చేతుల్లోకి వెళ్తే ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ తీరుపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. జన గణన ఏ విధంగా నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన అంశమని తేల్చి చెప్పారు. ఎంత మంది వెనుకబడిన ప్రజలు ఉన్నారో తెలిస్తేనే ప్రభుత్వం సంక్షేమ చర్యలు తీసుకోగలదని వ్యాఖ్యానించారు. ఇలాంటి విధానపరమైన ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని, ఇది పూర్తిగా న్యాయస్థానాల పరిధికి మించిన అంశమని పేర్కొన్నారు. అందువల్ల జన గణనలో కుల గణన మినహాయించాలని కోరుతూ దాఖలైన ఈ పిల్‌‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.


V6 News 54 minutes ago
Home Flash News