బీజేపీ పిరికితనంతో ఓట్లను తొలగిస్తోంది.. ఓట్ల చోరీపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫైర్
కేంద్రంలోని బీజేపీ సర్కార్ , రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో బీజేపీ పిరికితనంతో వ్యవహరిస్తోందని ఎస్‌ఐఆర్ విధానాన్ని అడ్డుపెట్టుకుని భారీగా ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు. గతంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఇదే ఎస్‌ఐఆర్ విధానంతో సిట్టింగ్ ముఖ్యమంత్రులను ఓడించారని ఎంపీ వంశీకృష్ణ గుర్తు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ గురించి గతంలోనే రాహుల్ గాంధీ హెచ్చరించారని... ఇప్పుడు ఆ ఓటు చోరీని మనం కళ్లారా చూస్తున్నామని వంశీకృష్ణ అన్నారు. అంబేద్కర్ కల్పించిన పవిత్రమైన ఓటు హక్కును ప్రజలకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఈ ఓటు హక్కును కాపాడుకోవడానికి బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీలపైనా ఎంపీ నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రులు నీట్ పేపర్లు అమ్ముకుని బతుకుతున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమాలు చేస్తున్నా... కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు.