వైఎస్సార్ విగ్రహం ధ్వంసం వెనుక వైసీపీ కుట్ర..జగన్‌పై లోకేష్ హాట్ కామెంట్స్!
అమరావతి: వైసీపీ అధినేత జగన్‌పై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ తన 'గొడ్డలి పార్టీ' కార్యకర్తలను రంగంలోకి దింపారని ఆయన ఆరోపించారు. జగన్ నాటకాలు చూసి ప్రజలు ఎప్పుడో విసిగిపోయినా, ఆయన మాత్రం తన డ్రామాలు ఆపడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. నంద్యాలలో ఇటీవల జరిగిన వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటనను ప్రస్తావిస్తూ, ఈ ఉదంతం వెనుక వైసీపీ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని లోకేష్ ఆరోపించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు జమ్ములయ్య స్థానిక వైసీపీ నేతల ముఖ్య అనుచరుడేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ నేత విగ్రహాన్ని తామే ధ్వంసం చేయించి, ఆ నెపాన్ని ప్రభుత్వంపైకి నెట్టేందుకు జగన్ తన కార్యకర్తలతో ఇలాంటి అశాంతి పర్వానికి తెరలేపారని విమర్శించారు.