Select Location
All Locations
State
Region
City / District
బొగ్గు స్కామ్ దాచేందుకే కిషన్ రెడ్డిపై ఆరోపణలు..45 లక్షల టన్నుల బొగ్గు దొంగలెవరో తేల్చాలి: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు

బొగ్గు స్కామ్ దాచేందుకే కిషన్ రెడ్డిపై ఆరోపణలు..45 లక్షల టన్నుల బొగ్గు దొంగలెవరో తేల్చాలి: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు

హైదరాబాద్, వెలుగు: సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టేందుకు, ఈ అవినీతిపై నిజాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. నాంపల్లి బీజేపీ స్టేట్​ఆఫీసులో శనివారం ప్రముఖ పారిశ్రామికవేత్త ఫణి కుమార్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మీడియాతో రాంచందర్ రావు మాట్లాడుతూ.. సింగరేణిలో దాదాపు 45 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనే వార్తల నేపథ్యంలో నిజానిజాలు తెలుసుకోవడానికి బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందని మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు బీజేపీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని, ఈ బొగ్గు దొంగతనం వెనుక ఉన్న అసలు దొంగలెవరో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సింగరేణి సంస్థపై పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయని, అందుకే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతాయుతంగా ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా చంపేస్తోందని విమర్శించారు. రేషనలైజేషన్ పేరిట స్కూళ్లను తగ్గించి, ఇప్పుడు మూసివేత దిశగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు.


V6 News 2 hours ago
Home Flash News