FIFA World Cup 2026 | డచ్ దెబ్బకు కుప్పకూలిన స్వీడన్.. 5-1తో నెదర్లాండ్ భారీ గెలుపు
FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ ‘F’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 5-1 గోల్స్ తేడాతో స్వీడన్‌పై అద్భుత విజయం సాధించింది. టెక్సాస్‌లోని హ్యూస్టన్ స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో డచ్ ఆటగాళ్లు ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. నెదర్లాండ్స్ స్ట్రైకర్ బ్రియాన్ బ్రాబీ మ్యాచ్ ప్రారంభమైన 5వ నిమిషంలోనే మొదటి గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 17వ నిమిషంలో మరో గోల్ కొట్టి ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి స్కోరును 2-0కు చేర్చాడు. సెకండ్ హాఫ్ మొదలైన వెంటనే లివర్‌పూల్ స్టార్ ఆటగాడు కోడి గ్యాక్పో విజృంభించాడు. 47వ, 54వ నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేసి స్వీడన్ ఆశలపై నీళ్లు చల్లాడు.
స్వీడన్ తరఫున 59వ నిమిషంలో ఆంథోనీ ఎలాంగా ఒక గోల్ అందించి తేడాను తగ్గించే ప్రయత్నం చేశాడు. అయితే ఆట ఆఖరి నిమిషాల్లో 89వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన క్రిసెన్సియో సమ్మర్‌విల్ మరో మెరుపు గోల్ చేయడంతో నెదర్లాండ్స్ 5-1తో ఘన విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ విజయంతో గ్రూప్ Fలో నెదర్లాండ్స్ జట్టు 4 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుని రౌండ్ ఆఫ్ 32కు చేరడానికి మరింత చేరువైంది. స్వీడన్ జట్టు 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.