నరకం చూపిస్తాం: అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ డెడ్లీ వార్నింగ్
ఇరాన్పై అమెరికా దాడులు మళ్లీ పెరగడంతో నరకం చూడాల్సి వస్తుందని అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక చేసింది. ఇరాన్ భూభాగంపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా.. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నౌకాదళం, ఏరోస్పేస్ దళాలు సంయుక్తంగా క్షిపణి, డ్రోన్ దాడులు చేశాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదివారం తెల్లవారుజామున ప్రకటించింది. దీంతో.. గల్ఫ్ దేశాలు మళ్లీ వణికిపోతున్నాయి.
సిరిక్‌పై అమెరికా దాడులు హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణను బలహీనపరచలేవని ఇరాన్ IRGC నౌకాదళం పేర్కొంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు నరకం చవిచూస్తాయని కూడా ఇరాన్ హెచ్చరించింది. కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘించిందని IRGC ఆరోపించింది. అమెరికా ఇలాంటి వైఖరితోనే ఉంటే.. కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేసుకునే అవకాశం ఉందని ఇరాన్ హెచ్చరించింది.
హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న సింగపూర్ రిజిస్టర్డ్ కంటైనర్ నౌక ‘ఎవర్ లవ్లీ’పై డ్రోన్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నౌక పాక్షికంగా దెబ్బతిన్నట్లు సింగపూర్ మారిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ (ఎంపీఏ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సింగపూర్ కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఈ నౌక జలసంధి దాటుతుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలోని ‘బ్రిడ్జ్’(నియంత్రణ గది) ప్రాంతం దెబ్బతింది. షిప్‌లోని ఇంజన్, నావిగేషన్ పరికరాలు పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు.