నైపుణ్య తెలంగాణే లక్ష్యంగా.. ప్రజా ప్రభుత్వం అడుగులు...
చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించాలి’ బాగా ప్రాచుర్యం పొందిన ఈ సామెత నేటి విద్యావిధానాల దిశను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఒకరికి చేపలు ఇస్తే ఒకరోజు జీవిస్తాడు. అదే చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం బతకగలడు. ఇదే భావన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు కేంద్రంగా మారింది.
నైపుణ్యాభివృద్ధి పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. మార్కెట్, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యను ఉపాధితో అనుసంధానించే చర్యలను ప్రజా ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం నుంచి అంతర్జాతీయస్థాయి నైపుణ్యాల కల్పన వరకు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర విద్యారంగాన్ని సరికొత్త పథంవైపు నడిపిస్తున్నాయి. విద్యను కేవలం డిగ్రీలు అందించే వ్యవస్థగా కాకుండా, జీవితాన్ని నిర్మించేశక్తిగా మార్చేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు.
2024 ఆగస్టు 1న ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ మార్కెట్‌కు అవనరమైన నైపుణ్యాలను అందించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి చాన్సలర్‌గా ఉండగా, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడిన బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పర్యవేక్షిస్తోంది.
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్రా నేతృత్వంలో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని తాత్కాలిక క్యాంపస్‌లో హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెన్, ఫార్మా, లాజిస్టిక్స్, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ వంటి రంగాల్లో స్వల్పకాలిక, సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నారు. టెక్స్ట్ బుక్ చదువులకు స్వస్తి చెప్పి, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు శిక్షణ ఇవ్వాలనే రేవంత్ రెడ్డి విజన్‌కు నిదర్శనంగా.. ఇటీవల ఈ యూనివర్సిటీలో ‘డేటా సెంటర్ మేనేజ్‌మెంట్’ కోర్సు పూర్తి చేసుకున్న 14 మంది విద్యార్థుల్లో 11 మందిని ప్రముఖ గ్లోబల్ ఐటీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ రూ.7 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం నిజంగా గర్వకారణం.